telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ముగిసిన కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

తీవ్ర ఉత్కంఠ మ‌ధ్య‌ కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక పూర్తయ్యింది. గ‌త రెండు రోజులుగా వాయిదా ప‌డిన ఎన్నిక‌ను హైకోర్టు ఆదేశాలు మేర‌కు అధికారులు ఈవేళ ఎన్నిక నిర్వ‌హించారు.29 స్థానాలకు గానూ ఎన్నికలు జరిగాయి.

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా టీడీపీ తన సత్తా చాటుకుంది. .అయితే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల అధికారులు ఫలితాలను ప్రకటించలేదు. ఛైర్మన్‌గా టీడీపీ సభ్యుడు చెన్నుబోయిన చిట్టిబాబును ఆ పార్టీ సభ్యులు బలపరిచారు. దీంతో ఆయన ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎంపీ కేశినేని నాని ఓటుతో టీడీపీకి మెజారిటీ వచ్చింది. వైస్ ఛైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాసరావు, మరో వైస్ ఛైర్మన్‌గా కరిపికొండ శ్రీలక్ష్మీకి టీడీపీ సభ్యులు ఆమోదం తెలిపారు.

వైసీపీ 14 వార్డుల్లో విజయం సాధించగా, ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా వసంత కృష్ణప్రసాద్‌ ఉన్నప్పటికీ వారి బలం 15కే పరిమితం అయింది. టీడీపీ 14 వార్డుల్లో విజయం సాధించగా, స్వతంత్ర సభ్యురాలి చేరికతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఎక్స్‌ అఫిషియోగా ఎంపీ కేశినేని నానీకి కోర్టు ఓటు హక్కును కల్పించడంతో టీడీపీ బలం 16కు పెరిగింది.

కాగా మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మూడో రోజూ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముళ్ల కంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. సుమారు 750 మంది పోలీస్ బలగాలతో పహారా కాశారు. హైకోర్టు ఆదేశాలతో అధికారులు ఎన్నికను నిర్వహించారు.

Related posts