telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బీజేపీలో చేరిక పై క్లారిటీ ఇచ్చిన కొండా విశ్వేశ్వరరెడ్డి…

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో పొలిటికల్‌ జంపింగ్‌లకు తెరలేచింది.. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఇలా.. ఏ పార్టీకి మినహాయింపులేకుండా పోయింది. ఇక, ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ.. గ్రేటర్‌ పీఠం కూడా తమదే అంటోంది.. దీనిలో భాగంగా.. అన్ని పార్టీల నేతలను కలసి మరీ.. తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారట.. ఈ జాబితాలో మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు కూడా ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.. ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. కొండా కూడా బీజేపీ కండువా కప్పుకుంటారనే గుసగుసలు వినిపించాయి. దీనిపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు కొండా విశ్వేశ్వరరెడ్డి.. నేను బీజేపీలోకి వెళ్తున్నానంటూ 2016 నుండి వెయ్యి సార్లు ప్రచారం జరిగిందన్న ఆయన.. నేను రూలింగ్ పార్టీ (టీఆర్ఎస్‌) నుండి బయటకు వచ్చిన వ్యక్తిని మళ్లీ రూలింగ్‌ పార్టీ (బీజేపీ)లోకి వెళ్లబోనని స్పష్టం చేశారు. ఇక, తన గ్రాఫ్ పడిపోతుందనే టీఆర్ఎస్ పార్టీ తొందరగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పెట్టుకుంది అంటూ ఎద్దేవా చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి.. టీఆర్ఎస్‌ గ్రాఫ్ ఇంత తొందరగా పడిపోతుంది అని అనుకోలేదన్నారు. మరోవైపు.. బీజేపీలో కొందరు కాంగ్రెస్‌ నేతలు చేరడంపై స్పందిస్తూ.. భిక్షపతి యాదవ్ బీజేపీలోకి పోయారు.. కాంగ్రెస్ ఖతం అయ్యిందని బీజేపీ అంటుంది.. కానీ, కాంగ్రెస్ ఖతం అయ్యేది ఎప్పుడూ ఉండదన్నారు. భిక్షపతి యాదవ్ బీజేపీలోకి వెళ్లడంతో టీఆర్ఎస్‌కు లాభమని అభిప్రాయపడ్డ ఆయన.. ఆలోచన చేయకుండా పార్టీ మారిపోయాడు అంటూ భిక్షపతి యాదవ్‌ను ఉద్దేశించి మాట్లాడారు.

Related posts