telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నీళ్లలో ఉండే వెనిస్ సిటీలా హైదరాబాద్‌ను మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది

komati-venkat-reddy mp

తెలంగాణ ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “భారీ వర్షాలు.. రైతును నిండా ముంచినా.. రైతులు తమకు జరిగిన నష్టాన్ని తట్టుకోలేక ఆత్మహత్యల బాట పడుతున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనీస కనికరం కూడా లేకుండా పోయింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం లాల్ తండాకు చెందిన బానోత్ సురేశ్ అనే యువ రైతు ఆత్మహత్య చేసుకోవడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. భారీ వర్షాలతో తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంట నీటి మునిగినా కనీసం ఏరియల్ సర్వే కూడా నిర్వహించడానికి కేసీఆర్‌కు తీరిక లేదా..? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉండటంతో కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ కూడా హైదరాబాద్ బస్తీల్లో మాత్రమే తిరుగుతున్నారు… . ఆరేళ్ల క్రితం కేసీఆర్ పది నిమిషాలు వానపడితే హైదరాబాద్ మునిగిపోతుందని చెప్పారు. హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తామన్నారు. ఇప్పుడు చివరకి నీళ్లలో ఉండే వెనిస్ సిటీలా హైదరాబాద్‌ను మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. బతుకమ్మ చీరల పంపకంలో బీజీగా ఉన్న అధికారపార్టీ నేతలు భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పలకరించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.. రైతులకు కావాల్సింది నష్టపరిహారమే కానీ.. 200 రూపాయల చీరలు కాదు. రైతు బంధు పథకంతో భూస్వాములకు మేలు కలిగిందే తప్పా.. కౌలు రైతులకు కాదు.రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతుల్లో ఎక్కువగా కౌలు రైతులే ఉన్నారు. వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. ఎకరానికి రూ.20 వేల పంటనష్ట పరిహారాన్ని ప్రకటించాలి. కౌలు రైతులకు పంటల బీమా పథకాన్ని వర్తింపచేయాలి. తెలంగాణ వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా రైతులను ఓదార్చేందుకు .. వారికి భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణం. ప్రస్తుతం హైదరాబాద్ వరదల్లో కార్లు కొట్టుకుకపోవడం చూస్తున్నాం. కేసీఆర్ సర్కారు రైతులను పట్టించుకోకుంటే కారు పార్టీ కూడా ప్రజాగ్రహంలో అలా కొట్టుకుపోవడం ఖాయం.” అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

Related posts