telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల… పరిశ్రమలు బై బై జగన్ అంటూ వెళ్లిపోతున్నాయి

ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన పరిశ్రమలు బై బై జగన్ అంటూ వెళ్లిపోతున్నాయని టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క కొత్త పరిశ్రమనైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే యువతకి ఉపాధి లభిస్తుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడి పరిశ్రమలు తీసుకువచ్చారని అన్నారు. చంద్రబాబు తీసుకువచ్చిన పరిశ్రమలను వైసీపీ నేతలు భయపెట్టి రాష్ట్రం నుండి వెళ్లగొడుతున్నారని చెప్పారు. వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చిన దాదాపు 10 కంపెనీలు ఏపీ నుంచి వెళ్లిపోయాయన్నారు. పరిశ్రమలు వెళ్లిపోతుంటే ఏపీఐఐసి చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. యువతను నిర్వీర్యం చేసి వాలంటిర్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేలా చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో పెట్టుబడుల్లో ఏపీ రెండవ స్థానంలో ఉంటే ఇప్పుడు 16వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నందుకు ముఖ్యమంత్రి సిగ్గు పడాలన్నారు. ‘‘పరిశ్రమలు తీసుకురాలేకపోతే మీరు తప్పుకోండి….అంతే కానీ మీ చేతకానితనంతో యువత జీవితాలను నాశనం చేయొద్దు’’ అని కొల్లు రవీంద్ర అన్నారు.

Related posts