telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ప్రత్యర్థులతో శత్రుత్వం .. మైదానం వరకే .. : కోహ్లీ

kohli tweet on opposite team

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ ప్రత్యర్థి ఆటగాళ్లతో శత్రుత్వం మైదానం వరకే పరిమితం అవుతుందని అన్నాడు. మనసు విప్పుకొని నవ్వితే ఆటగాళ్ల మధ్య ఆందోళనలన్నీ అటకెక్కుతాయని పేర్కొన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ చక్కని చిత్రాన్ని పంచుకొని విరాట్‌ ఈ మేరకు తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ చిత్రంలో దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబీ డివిలియర్స్‌, ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌, టీమిండియా సారథి కోహ్లీ విరగబడి నవ్వుతుండటం గమనార్హం.

‘క్రీడల్లో ఉన్న అందం ఏంటంటే శత్రుత్వాలు మైదానాలకే పరిమితం అవుతాయి. మనసారా ఒక నవ్వు నవ్వితే ఆటగాళ్ల మధ్య ఆందోళనలు అన్నీ మాయం అవుతాయి. మైదానంలో కఠినంగా పోరాడాలి. నవ్వేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆటల ద్వారా అద్భుతమైన వ్యక్తులు దొరకడం ఆశీర్వాదమే’ అని ఆ చిత్రానికి కోహ్లీ తన వ్యాఖ్యను జోడించాడు. ఇయాన్‌ మోర్గాన్‌, ఏబీ డివిలియర్స్‌ను ట్యాగ్‌ చేశాడు. ఏబీడీ, విరాట్‌ మధ్య ఎంత చక్కని అనుబంధం ఉందో అందరికీ తెలిసిందే. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున వీరిద్దరూ మరిచిపోలేని ఇన్నింగ్సులు ఎన్నో ఆడి, అభిమానులను అలరించారు. టీమిండియా సారథిని ఏబీడీ సోదరుడిలా చూసుకుంటాడు.

Related posts