telugu navyamedia
క్రీడలు వార్తలు

ఫీల్డ్ అంపైర్ తప్పిదం… కోహ్లీకి తప్పిన ముప్పు

డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ లో వర్షం కారణంగా తొలి రోజు టాస్‌ పడకుండానే ఆగిపోయిన మ్యాచ్‌.. రెండో రోజు శనివారం వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్‌ మధ్యలో నిలిచిపోయింది. ఆట నిలిచే సమయానికి భారత్‌ స్కోరు 64.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 146 రన్స్ చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (44), వైస్ కెప్టెన్ అజింక్య రహానే (29) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 147 బంతుల్లో 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో కైల్ జేమీసన్‌, నీల్ వాగ్నర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ తలా ఓ వికెట్‌ తీశారు. అయితే ఫైనల్ మ్యాచ్‌కి విధులు నిర్వహిస్తున్న ఇంగ్లండ్ తటస్థ అంపైర్ రిచర్డ్ లింగ్‌వర్త్ న్యూజిలాండ్‌కి సాయపడ్డాడు. కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. బంతిని లెగ్ స్టంప్‌కి కాస్త దూరంగా విసిరాడు. ఫైన్ లెగ్ దిశగా షాట్ ఆడేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రయత్నించాడు. అయితే బ్యాట్‌కి దొరకని బంతి నేరుగా వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ చేతుల్లోకి వెళ్లింది. బంతి బ్యాట్‌కి అతి సమీపంలో వెళ్లడంతో.. క్యాచ్ ఔట్ కోసం న్యూజిలాండ్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ లింగ్‌వర్త్ కివీస్ ఆటగాళ్ల అప్పీల్‌ని తిరస్కరించాడు. దాంతో బౌల్ట్, కీపర్ వాట్లింగ్‌తో చర్చించిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డీఆర్‌ఎస్ కోరేందుకు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో అంపైర్ లింగ్‌వర్త్ తన అతితెలివితో కివీస్‌కు సాయం చేసేందుకు చూశాడు. విలియమ్సన్ రివ్యూ కోరకముందే.. తుది నిర్ణయం కోసం టీవీ అంపైర్‌ని అతడు ఆశ్రయించాడు. మైదానంలోని సౌండ్స్ కారణంగా తాను క్లియర్‌గా బ్యాట్ సౌండ్ వినలేకపోయానని టీవీ అంపైర్‌తో లింగ్‌వర్త్ చెప్పాడు. దాంతో విలియమ్సన్ రివ్యూ తీసుకునే అవకాశం లేకుండా అయింది. రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి బ్యాట్‌కి దూరంగా వెళ్తున్నట్లు తేల్చి విరాట్ కోహ్లీని నాటౌట్‌గా ప్రకటించాడు. ఒకవేళ కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డీఆర్‌ఎస్ కోరి ఉంటే.. అప్పుడు న్యూజిలాండ్‌కి రివ్యూ ఛాన్స్ మిస్ అయ్యేది. అంతకముందే ఎల్బీడబ్ల్యూ కోసం డీఆర్‌ఎస్‌కి వెళ్లిన కివీస్.. ఒక రివ్యూ అవకాశాన్ని చేజార్చుకుంది.

Related posts