telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మరో రికార్డు నమోదు చేసిన.. కోహ్లీ..

Virat

విరాట్‌ కోహ్లీ టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇండోర్‌ వేదికగా మంగళవారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఈ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ పేరిట ఉండేది. డుప్లెసిస్‌ 31 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధిస్తే కోహ్లీ 30 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో కేన్ విలియమ్సన్ (36), ఇయాన్‌ మోర్గాన్‌ (42), విలియమ్‌ పోర్టర్‌ఫీల్డ్‌ (54), ఎంఎస్‌ ధోనీ (57) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. శ్రీలంక మ్యాచ్‌లో అజేయంగా 30 పరుగులు సాధించిన కోహ్లీ మరో రికార్డు నమోదు చేశాడు. పొట్టిఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ (2,663) నిలిచాడు. రెండో స్థానంలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (2,633) ఉన్నాడు.

రెండో టీ20లో భారత్‌ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన శ్రీలంక ఓ చెత్త రికార్డు నమోదు చేసుకుంది. పొట్టిఫార్మాట్‌లో అత్యధిక ఓటములను చవిచూసిన జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు 125 టీ20లు ఆడిన శ్రీలంక 62 మ్యాచుల్లో ఓడింది. అత్యధిక ఓటముల జాబితాలో 61 పరాజయాలతో వెస్టిండీస్‌, 60 ఓటములతో బంగ్లాదేశ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం పుణెలో శ్రీలంకతో భారత్‌ ఆఖరి మ్యాచ్ ఆడనుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.

Related posts