telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. ప్రాక్టీస్ మ్యాచ్ లో .. చతికిల పడిన భారత జట్టు..

kohli lost drastically in practice session

ఘనంగా ఇంగ్లాండ్‌ పర్యటనను ఆరంభించాలని ఆశించిన భారత్‌కు నిరాశే ఎదురైంది. వామప్‌ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలమయ్యారు. ఐసీసీ వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో శనివారం న్యూజిలాండ్‌తో తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనే బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. కివీస్‌ బౌలర్ల ధాటికి భారత్‌ టపటపా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(2), శిఖర్‌ ధావన్‌(2) ఆరంభంలోనే ఔటయ్యారు.

ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(18), లోకేశ్‌ రాహుల్‌(6), హార్దిక్‌ పాండ్య(30), మహేంద్రసింగ్‌ ధోనీ(17), దినేశ్‌ కార్తీక్‌(4), భువనేశ్వర్‌ కుమార్‌(1) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. జేమ్స్ నీష‌మ్‌, ట్రెంట్ బౌల్ట్ త‌లో మూడు వికెట్లు తీసి భార‌త్‌ను కుప్ప‌కూల్చారు. కివీస్‌ బౌలర్లు పిచ్‌ నుంచి అందిన సహకారాన్ని సద్వినియోగం చేసుకొని చెలరేగిపోతున్నారు. కళ్లచెదిరే బంతులతో బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా పరుగులు చేయకుండా ఒత్తిడి పెంచి ఆధిపత్యం కొనసాగిస్తున్నారు.

పేపర్‌పై బలంగా కనిపిస్తున్న భారత్‌ మైదానంలో చేతులెత్తేసింది. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 8 వికెట్లకు 130 పరుగులు చేసింది. జడేజా(31) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కుల్దీప్‌(0) మరో ఎండ్‌లో ఉన్నాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అయినప్పటికీ నిర్ణీత ఓవర్ల కన్నా ముందే భారత జట్టు ఆలౌట్‌కు దగ్గర్లో నిలిచింది.

Related posts