telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కోబి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోతాడు… 8 ఏళ్ల ముందే చెప్పిన వ్యక్తి…!!?

Kobi

విఖ్యాత బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు కోబి బ్రయంట్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఆదివారం జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృత్యువాత పడగా ఇందులో బ్రయంట్‌ కూతురు 13 ఏళ్ల గియాన కూడా ఉంది. ఈ హఠాత్‌పరిణామంతో ప్రపంచ క్రీడాలోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికా అధ్యక్షుడి నుంచి సామాన్య క్రీడాభిమాని వరకు ఈ ఎన్‌బీఏ మాజీ సూపర్‌స్టార్‌ను వేనోళ్ల కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు. అమెరికాలో అనేక చోట్ల కోబి మృతికి సంతాపం తెలుపుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. 

కోబి మరణవార్త నన్ను కలచివేసింది. ప్రమాదంలో అతడి కుమార్తె సైతం మృతిచెందడంతో గుండె బద్దలైంది : కోహ్లీ

బ్రయంట్‌, అతడి కూతురు దుర్మరణం పాలవడం ఎంతో విషాదకరం. పెను విషాదం : సచిన్‌ టెండూల్కర్‌

క్రీడా లోకంలో నిజమైన లెజెండ్‌. కోబి, అతడికి కూతురు ఆత్మకు శాంతి కలగాలి : వివ్‌ రిచర్డ్స్‌

నా ఫేవరేట్‌ ఆటగాడతను. కోబి మరణం ఎంతో బాధాకరం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కన్నీటితో ప్రార్థిస్తున్నా : కేటీఆర్‌

‘బ్లాక్‌ మాంబా’గా పిలుచుకునే బ్రయంట్‌.. బాస్కెట్‌బాల్‌లో రెండు దశాబ్దాల పాటు తన అసమాన ఆటతీరులో అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. అయితే కోబీ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోతాడు 2012లో ఓ ట్వీటర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం. 

41 ఏళ్ల బ్రయంట్‌ కాలిఫోర్నియాలోని ఆరెంజ్‌ కౌంటీలో నివాసముంటాడు. ఇక్కడి జాన్‌ వేన్‌ విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరిన తొమ్మిది మంది బృందం 30 మైళ్ల దూరంలోని థౌజండ్స్‌ ఓక్‌కు చేరుకోవాల్సి ఉంది. కానీ 40 నిమిషాల్లోనే పశ్చిమ లాస్‌ఏంజెల్స్‌ వైపున కాలబసాస్‌ ప్రాంతంలో అది కుప్పకూలింది. ఆ వెంటనే మంటల్లో చిక్కుకు పోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. అగ్నిమాపక బృందాలు, వైద్య సిబ్బంది హుటాహుటిన క్లిష్టమైన ఆ ప్రాంతానికి చేరుకున్నా అగ్నికీలలకు అప్పటికే మృతదేహాలన్నీ బూడిదగా మారాయి. ఆకాశం దట్టమైన మేఘాలతో ఉండడమే హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అసలు మధ్యాహ్నం వరకు విమానాలు ప్రయాణించేందుకు అనుకూల పరిస్థితి లేదని స్థానిక పోలీస్‌ శాఖ కూడా పేర్కొంది. బ్లాక్‌బాక్స్‌ లభించాక మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. అలాగే మృతదేహాలను అక్కడి నుంచి తీసుకు రావడానికి చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఎల్‌ఏ కౌంటీ వైద్యాధికారి తెలిపాడు.

బాస్కెట్‌బాల్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఆటగాళ్లలో ఒకడైన బ్రయంట్‌ 20 ఏళ్ల ఎన్‌బీఏ కెరీర్‌లో లాస్‌ఏంజెల్స్‌ లేకర్స్‌కే ప్రాతినిథ్యం వహించాడు. 2016లో ఆటకు గుడ్‌బై చెప్పిన బ్రయంట్‌కు భార్య వనెస్సా, నలుగురు కూతుళ్లున్నారు. ప్రమాదంలో మృతి చెందిన అతడి రెండో కూతురు గియానను తన వారసురాలిగా తీర్చిదిద్దాలని కోబి ఆలోచన. ఈ ప్రయాణం కూడా ‘కోబి బ్రయంట్‌ మాంబా స్పోర్ట్స్‌ అకాడమీ’లో జరగబోయే తన బాస్కెట్‌బాట్‌ టోర్నీ కోసమే పెట్టుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు వీరంతా ప్రమాదానికి గురయ్యారు. అలాగే ఆరెంజ్‌ కోస్ట్‌ కాలేజ్‌ బేస్‌బాల్‌ కోచ్‌, అతడి భార్య, కూతురుతోపాటు పైలెట్‌ కూడా ఈ ఘటనలో చనిపోయినట్టు సీఎన్‌ఎన్‌ చానెల్‌ పేర్కొంది. 

Related posts