telugu navyamedia
తెలంగాణ వార్తలు

తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురి అరెస్టు..

తెలంగాణ‌లో సంచలనం సృష్టించిన‌ తెల్దార్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కృష్ణయ్యను దారుణంగా హతమార్చిన ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేశారు.

వారిలో ఏ2 రంజన్‌, ఏ4 గంజిస్వామి, ఏ5 లింగయ్య, ఏ6 బోడపట్ల శ్రీను, ఏ7 నాగేశ్వరరావు, ఏ8 నాగయ్య ఉన్నారు. ఇక, ఏ1 తమ్మినేని కోటేశ్వరరావు, ఏ3 కృష్ణ పరారీలో ఉన్నారు . వారివద్ద హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పగ.. ప్రతీకారంతో ఈ హత్య ఉదంతం చర్చనీయాంశంగా మారింది. చాలా కాలం తర్వాత జిల్లాలో రాజకీయ హత్య జరగడంతో రాజకీయ పార్టీలు ఒక్క‌సారిగా ఉలిక్కిపడ్డాయి.

ఖమ్మం జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజే తెల్దారుపల్లికి చెందిన తెరాస నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య (62) సోమవారం దారుణహత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం కృష్ణయ్య పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తన అనుచరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా తెల్దారుపల్లి సమీపంలో.. వెనుక నుంచి ఆటోలో వచ్చిన దుండగులు ఆయన వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కృష్ణయ్య, ఆయన అనుచరుడు ముత్తేశం రహదారి పక్కన కాలువలో పడిపోయారు. దుండగులు ఆటోలో నుంచి దిగి వేటకొడవళ్లతో కృష్ణయ్యపై విచక్షణారహితంగా చేతులు న‌రికి దాడి చేయ‌డంతో  అక్కడికక్కడే మృతి చెందారు. 

ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి, పోలీసు జాగిలం చూపిన దారిని బట్టి చూస్తే ఈ దారుణ హత్య ) వెనుక ఉన్నది తమ్మినేని కోటేశ్వరరావు అని తేలిపోయింది. నిజానిజాలు, సాక్ష్యాలు, విచారణలు ఎలా ఉన్నా ఆవేశంలో ఉన్న తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ సానుభూతిపరులు చేసిన దాడిలో సీపీఎం నాయకుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు నివాసం, వాహనాలు ధ్వంసం చేశారు.

Related posts