నగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఉత్సవం ప్రారంభం అయ్యింది. నిర్వాహకులు, పోలీసు సిబ్బంది క్రేన్ సహాయంతో విగ్రహాన్ని భారీ వాహనంపైకి ఎక్కించారు. గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ఇవాళ మధ్యాహ్నంలోగా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని విగ్రహాలను ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తున్నారు. మహాగణపతిని గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు భారీ క్రేన్‌ను ఇప్పటికే హుస్సేన్‌సాగర్ దగ్గర సిద్ధం చేశారు. మరోవైపు హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడుతోంది. అయినప్పటికీ వర్షం మధ్యే ఎన్టీఆర్ మార్గ్‌లో భక్తులు విగ్రహాల నిమజ్జనం కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో సుమారు 40వేల వరకు గణనాథుడి ప్రతిమలను నేడు నిమజ్జనం చేయనున్నారు. నేటి ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగనున్న దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచే అమలవుతున్న దృష్ట్యా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వ్యక్తిగత వాహనాలు తీసుకొస్తే ఇబ్బందులు పడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.