telugu navyamedia
రాజకీయ వార్తలు

కేజ్రీవాల్ ఆఫర్లు : … నీటి పన్ను బకాయిలను మాఫీ …

kejriwal on his campaign in ap

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల సీబీఎస్‌ఈ పరీక్ష ఫీజులను రీయింబర్స్‌మెంట్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఢిల్లీ జలమండలి పరిధిలోని నీటి మీటర్లు ఉన్న గృహ వినియోగదారులందరికీ నీటి పన్ను బకాయిలను మాఫీ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ ఏడాది నవంబరు 30 వరకు ఈ పథకం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

నీటి మీటర్ల వినియోగం పెరిగి ప్రభుత్వానికి రూ.600 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా. ఈ పథకంలో చేరాలనుకునేవారు తమ ఇంటి వద్ద మీటర్లు బిగించుకోవాలని సూచించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ఇటీవల 200 యూనిట్ల లోపు వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, మెట్రో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. మెట్రోల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్టు ప్రకటించినా ఆ పథకం కార్యరూపం దాల్చలేదు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం దూకుడుగా వ్యహరిస్తూ సంక్షేమ పథకాలను వరుసపెట్టి ప్రకటిస్తోంది.

Related posts