kcr warning to rtc employees

ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ వార్నింగ్ 

35
 
ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని, సమ్మెలో  పాల్గొంటే తక్షనమే ఉద్యోగాలు తొలగిస్తామని  ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు.  ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా స్పందించారు.  గురువారం  ప్రగతిభవన్‌లో మంత్రులు, సీఎస్‌, డీజీపీ, ఆర్టీసీ ఎండీతో సమావేశమైన ఆయన ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 
 
 కొందరు తమ స్వలాభం కోసం సమ్మె నోటీస్ ఇవ్వడంలో ఔచిత్యాన్ని ఆర్టీసీ   కార్మీకులు ఆలోచించాలన్నారు.  ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇవ్వడం బాధ్యతారాహిత్యమన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు తక్షణమే సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, సమ్మెలో పాల్గొంటే తక్షణమే ఉద్యోగాల్లోంచి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు.
 
యూనియన్ నాయకులు ఆర్టీసీని ముంచే ప్రయత్నం  చేస్తున్నారని,  అసమంజసమైన కోరికల వల్ల ఆర్టీసీకి ఏటా మరో రూ.900 కోట్ల నష్టాలు వస్తున్నాయని సీఎం తెలిపారు. స్వలాభం కోసం కొందరు నాయకులు  చెప్పే మాటలు నమ్మి కార్మికులు మోసపోవద్దని సూచించారు. సమ్మె చేస్తే ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుందన్నారు. తెలంగాణ అంటే కేవలం 53వేల మంది కార్మికులే కాదని, తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు  సమ్మె నిర్ణయాన్ని  విరమించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.