కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు వెల్లడించారు. ఎవరింటికి వారు పరిమితం కావాలని, ఇవాళ జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రదర్శించిన స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు కనబర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడవద్దని స్పష్టం చేశారు.
ప్రజలకు నిత్యావసరవస్తువుల విషయంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇంటికి కావాల్సిన పాలు, కూరగాయలు, ఇతర సరుకులు తీసుకువచ్చేందుకు..ఆ ఇంటిలోని ఒక్క వ్యక్తికి మాత్రమే బయటకు వెళ్లే అనుమతివ్వడం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు
తెల్లరేషన్ కార్డుదారులందరికీ ప్రతీ ఇంట్లో ఒక్కొక్కరి 12 కిలోల చొప్పున నెలకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. బియ్యంతోపాటు ఇతర సరుకుల కొనుగోలు కోసం రూ.1500 నగదు అందజేస్తమన్నారు. మార్చి 31వరకు తెలంగాణవ్యాప్తంగా ప్రజా రవాణా బంద్ ఉంటుందని, ఆటోలు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు బంద్ ఉంటయన్నారు.