ఒక నాయకుడు, లేదా నటుల పై అభిమానం పెరిగిపోతే వారి పేర్లను పుట్టిన బిడ్డలకు లేదా ప్రాంతాలకు పెట్టడం మనదేశంలో సహజం. అయితే తాజాగా తెలంగాణాలో ఘనవిజయం సాధించిన తెరాస అధినేత కేసీఆర్ పేరును ఆ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలకు, ఆయా ప్రాంతాలకు పెట్టడం విశేషం. తాజాగా, రాష్ట్రంలోని గిరిజన తండాలను పంచాయతీలుగా మారుస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యను హర్షిస్తూ ఓ పంచాయతీ వాసులు తమ తండాకు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పెట్టడం విశేషం. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండంలోని ఓ తండాలో ‘కేసీఆర్ తండా’ అన్న బోర్డు వెలసింది.
గత ఏడాది ఆగస్టు 2వ తేదీన కేసీఆర్ ప్రభుత్వం తండాలకు పంచాయతీలుగా గుర్తింపు ఇస్తూ ప్రకటన జారీ చేసింది. అప్పట్లో తండా వాసులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ‘మా తండాలో మా రాజ్యం’ కోసం నినదిస్తున్న గిరిజనులు, కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అప్పట్లోనే చాలా సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా ఓ తండాకు ఆయన పేరు పెట్టుకుని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల ఓ అభిమాని తనకు పుట్టిన బిడ్డ పేరును కూడా కేసీఆర్ అని పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి గౌరవం దక్కించుకున్న కొద్దిమంది నాయకులలో కేసీఆర్ కూడా ఉండటం విశేషాన్ని సంతరించుకుంది.
ఒవైసీ ఒత్తిడికి కేసీఆర్ లొంగిపోయాడు: బీజేపీ నేత లక్ష్మణ్