కొండపోచమ్మ సాగర్‌లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. మర్కుక్ పంప్‌హౌస్‌లో చినజీయర్‌స్వామితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ మోటార్లను ప్రారంభించారు.ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. కేసీఆర్‌కు కొత్త నిర్వచనమిచ్చారు. కే అంటే కాల్వలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అని కేటీఆర్ తెలిపారు. కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతుండటంతో కేసీఆర్ పేరు సార్థకమైందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను తరలించారని తెలిపారు. సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కేవలం మూడేళ్లలోనే ప్రభుత్వం పూర్తి చేసింది అని కేటీఆర్ తెలిపారు.