telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఎమ్మెల్సీ స్థానానికి క‌ల్వకుంట్ల కవిత మరోసారి పోటీ

తెలంగాణలో జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 26. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనుండగా.. డిసెంబర్ 14 కౌంటింగ్ చేపట్టనున్నారు. పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది.

అధికార తెరాస తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. నిజామాబాద్ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ స్థానానికి  ఇవాళ క‌ల్వకుంట్ల కవిత నామినేషన్  దాఖలు చేశారు. గత ఏడాది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో గెలుపొందిన కవిత మరోసారి పోటీ చేయనున్నారు. కవిత వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్దన్, ఉమ్మడి జిల్లా ఎమ్మేల్యేలు ఉన్నారు. మొత్తం కవిత తరపున నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానన్నారు. తన ఎన్నిక కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. 90 శాతం ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, వారంతా సహకరించి గెలిపిస్తారని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాగా.. స్థానిక సంస్థల పోరులో బీజేపీ నుంచి నామినేషన్లు దాఖ‌లు చేయ‌లేదు. కాంగ్రెస్​ కేవలం 2 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఖమ్మం, మెదక్​ స్థానాల్లోనే కాంగ్రెస్​ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఖమ్మంలో ఆ పార్టీ తరఫున నాగేశ్వరరావు, మెదక్​లో నిర్మల నామపత్రాలు సమర్పించారు.

Related posts