telugu navyamedia
రాజకీయ వార్తలు

కాశ్మీర్‌ : … భద్రతా మండలి చర్చలు…

high alert in punjab on J & K issue

ఇటీవల భారత ప్రభుత్వం జమ్ముకాశ్మీర్‌ పై తీసుకున్న నిర్ణయం గురించి నేడు భద్రతా మండలిలో అంతరంగిక చర్చలు జరగనున్నాయి. కాశ్మీర్‌ అంశంపై భద్రతా మండలిలో చర్చించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితికి పాక్‌, చైనా లేఖలు రాసిన నేపథ్యంలో ఐరాస ఈ నిర్ణయం తీసుకుందని దౌత్యాధికారులు వెల్లడించారు. రోటేటింగ్‌ ప్రాతిపదికన ప్రస్తుతం భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో ఉన్న పోలండ్‌ కాశ్మీర్‌ అంశాన్ని ఆగస్టు 16న ఉదయం 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు) చర్చల జాబితాలో చేర్చినట్లు సదరు అధికారులు తెలిపారు.

కాశ్మీర్‌పై మూడో దేశం లేదా అంతర్జాతీయ సమాజ ప్రమేయముండరాదనేది ప్రజాస్వామ్యవాదుల ఆకాంక్ష. జమ్ముకాశ్మీర్‌ పునర్విభజనకు ముందే కాశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం నెరపాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనను కోరారని ఇదివరకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలపై పార్లమెంటు సమావేశాల్లోనూ తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో భారత్‌ వాదన ఐరాసలో ఎలా ఉండనుందనేది ఆసక్తిదాయకం. 1971 తర్వాత మళ్లీ కాశ్మీర్‌ అంశంపై ఐరాస భద్రతా మండలిలో చర్చ జరగడం ఇదే తొలిసారని దౌత్య నిపుణులు పేర్కొంటున్నారు. చర్చల ఫలితం ఏవిధంగా ఉన్నాకూడా దౌత్యపరంగా ఇదొక మైలురాయిగా నిలుస్తుందని చెబుతున్నారు.

1971లో కూడా కాశ్మీర్‌పై భద్రతా మండలిలో జరిగిన చర్చ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నదని ఈ సందర్భంగా వారు తెలిపారు. 1971లో బంగ్లాదేశ్‌ యుద్ధ సమయంలో కాశ్మీర్‌ సంబంధిత అంశాలపై జరిగిన చర్చ సిమ్లా ఒప్పందానికి దారి తీసిందని, అనంతరం కాశ్మీర్‌ విషయం అంతర్జాతీయ వేదికలకు దూరంగా ఉందని మాజీ విదేశాంగ మంత్రి కె.నట్వర్‌సింగ్‌ తెలిపారు. అప్పట్లో భద్రతా మండలి తీర్మానం 307 కింద కాశ్మీర్‌ అంశంపై చర్చ జరిగింది. ఈ తీర్మానం భారత్‌-పాక్‌ల మధ్య కాల్పుల విరమణను పాటించాలని సూచించింది.

Related posts