జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌కు పరోక్షంగా తోడ్పాటు అందిస్తున్న జమ్మూకశ్మీర్ వేర్పాటు వాద నేతలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకుంది. ఈరోజు సాయంత్రంలోగా మిర్వాజ్ ఉమర్ ఫరూఖ్‌తో పాటు అబ్దుల్ గనీ భట్, బిలాల్ లోనే, హశిమ్ కురేషీ, షాబిర్ షాలకు కల్పిస్తున్న భద్రతను వెనక్కు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది.
అంతేకాకుండా వీరి రక్షణకు ఇచ్చిన ప్రభుత్వ వాహనాలు, ఇతర సౌకర్యాలను ఉపసంహరించుకున్నారు. పుల్వామాలోని అవంతిపొరాలో గత గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జైషే కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ 100-150 కేజీల హైగ్రేడ్ ఆర్డీఎక్స్ ను వాడినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.