దక్షిణ భారత నటీనటుల సంఘానికి సంబంధించిన ఎన్నికలు ఈ నెల 23న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత సంఘ నిర్వాహక వర్గం నాజర్, విశాల్, కార్తీల బృందం మళ్లీ పోటీకి సిద్ధం అయ్యారు. ఈ జట్టును ఢీకొనేందుకు ఐసరి గణేశ్, దర్శక, నటుడు కే.భాగ్యరాజ్‌ల జట్టు సిద్ధం అయ్యింది. ఈ జట్ల నామినేషన్ల పర్వం కూడా పూర్తి అయ్యింది. ఇదిలా ఉండగా నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తి అయ్యే దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సంఘ కోశాధికారి బాధ్యతలను నిర్వహిస్తున్న నటుడు కార్తీ భవన నిర్మాణానికి కోటి రూపాయలను ఆర్థిక సాయం చేసినట్లు, అదే విధంగా సంఘ కార్యదర్శి విశాల్ రూ.25 లక్షల ఆర్థిక సాయం చేసినట్లు ప్రచారం అవుతోంది. సంఘం ఎన్నికల సమయంలో కార్తీ, విశాల్ ఆర్థిక సాయం చేయడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే చర్యలేనన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.