telugu navyamedia
రాజకీయ

గుండెపోటుతో కర్ణాటక మంత్రి ఉమేశ్ విశ్వనాథ మృతి..

కర్ణాటక అటవీ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ విశ్వనాథ కత్తి హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆయ‌న వ‌య‌సు 61 సంవ‌త్స‌రాలు. మంగళవారం రాత్రి ఇంట్లోనే ఉన్న ఆయనకు ఛాతీలో నొప్పి రావ‌డంతో ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాడు. వెంటనే మంత్రిని రామయ్య ఆసుపత్రికి త‌ర‌లించారు.

అప్ప‌టికే మంత్రి స్పృహ లేక‌పోవ‌డం, శ్వాస ఆగిపోవ‌డంతో..వైద్యులు అత్యవసర చికిత్స విభాగంలో ఇచ్చిన చికిత్సకు అందించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ శరీరం స్పందించక‌పోవ‌డంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

రాజకీయాల్లో విశ్వనాథ చాలా సీనియర్. ఆయన బెళగావి జిల్లా హుక్కేరి నుంచి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదుసార్లు మంత్రిగా పనిచేశారు.

1985లో జనతాదళ్ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 1999లో జేడీ (యూ) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నుంచి 2004లో పోటీచేసి ఓడిపోయారు. అప్పుడు మినహా, మరెప్పుడూ ఆయన ఓటమి ఎరుగలేదు.

2004లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 2008లో బీజేపీలో చేరారు. సదానందగౌడ మంత్రివర్గంలో తొలిసారి వ్యవసాయ శాఖ, యడియూరప్ప మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖను నిర్వహించిన ఆయన ప్రస్తుతం బొమ్మై మంత్రివర్గంలో ఆహార, అటవీశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు..

మంత్రి విశ్వనాథ మృతిపట్ల సీఎం బస్వరాజ్‌ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సేవాభావం, సమర్థత, అంకితభావం ఉన్న మంత్రి అని, ఆయన లేని లోటు తీర్చలేనిదని ట్వీట్ చేశారు. అనంతరం మంత్రి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

ఉమేష్ కత్తి మృతదేహాన్ని ఎయిర్ అంబులెన్స్‌లో స్వగృహానికి తరలించనున్నారు. సంకేశ్వరలో మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శన తర్వాత అన్ని ప్రక్రియలు జరుగనున్నాయి. బాగేవాడి బెళగావిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉమేష్ కత్తి మృతితో బెళగావిలోని పాఠశాలలు, కళాశాలలకు కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Related posts