యడియూరప్ప ప్రభుత్వం ఇవాళ మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. కేబినెట్‌లో చోటు కల్పించకపోవడంతో అసమ్మతిగా ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఈ విస్తరణ చేపట్టారు. ఇందులో ఏడుగురు కొత్త వారికి మంత్రులుగా చోటు దక్కింది. కర్నాటక రాజ్‌భవన్‌లో జరిగిన కేబినెట్ విస్తరణలో గవర్నర్ వాజూభాయ్ వాలా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా మంత్రులుగా అవకాశం దక్కిన వారిలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉమేష్ కట్టి(హక్కేరి), ఎస్.అంగర(సల్లియా), మురుగేష్ నిరానీ (బిల్గీ), అరవింద్ లింబావలీ(మహదేవపుర), ఎమ్మెల్సీలు ఆర్.శంకర్, ఎంటీబీ నాగరాజ్, సీపీ యోగేశ్వర్ ఉన్నారు. కేబినెట్‌లో తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు కల్పించారు. 2019 జూలైలో అధికారం చేపట్టిన తర్వాత యడియూరప్ప సర్కారుకు ఇది మూడో కేబినెట్ విస్తరణ. 17 ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కాంగ్రెస్-జేడీ ఎస్ ప్రభుత్వం కుప్పకూలడంతో అధికారంలోకి వచ్చిన యడియూరప్పకు సొంత పార్టీలో అసంతృప్తులు, తిరుగుబాటు దారులు ఎక్కువ కావడంతో ప్రభుత్వానికి సమస్యలు తప్పడం లేదు.
previous post