telugu navyamedia
రాజకీయ వార్తలు

వేడెక్కుతున్న .. బెంగళూరు.. శాసనసభ సమావేశాలు…

yadurappa karnataka

నేడు బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా శాసనసభ సమావేశాను ఎదుర్కొనబోతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యడియూరప్ప ఆ వెంటనే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కు ఆమోదం పొందారు. ఏటా శీతాకాల సమావేశాలు బెళగావి సువర్ణ సౌధలో కొనసాగాల్సివున్నా అక్కడ వరదల కారణంగా బెంగళూరుకే పరిమితం చేశారు. శాసనసభ సమావేశాలలో అధికార బీజేపీని ముప్పుతిప్పలు పెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌, జేడీఎ్‌సలు వేర్వేరుగా వ్యూహాలకు సిద్దమయ్యాయి. రెండునెలల క్రితం వరదలు సంభవించి రూ.38 వేల కోట్ల నష్టం వాటిల్లితే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేవలం రూ.1200 కోట్లు విడుదల చేయడాన్ని కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు ఆందోళనలు కొనసాగించారు. ఇక శాసనసభ కార్యకలాపాలను వేదికగా మార్చుకొని తీవ్ర స్థాయిలోనే ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టాలని నిర్ణయించారు.

సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ అధ్యక్షులు దినేష్‌ గుండూరావ్‌తో పాటు ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు భాగస్వాములయ్యారు. శాసనసభకు సభ్యులంతా హాజరు కావాలని ప్రతి అంశంపైనా ప్రభుత్వాన్ని నిలదీయాలని తీర్మానించారు. ఇక జేడీఎస్‌ మరో రెండు అడుగులు ముందుకేసింది. శాసనసభ కార్యకలాపాలు జరిగినంత కాలం నగరంలో నిరసనలు కొనసాగించాలని తీర్మానించింది. పార్టీ కార్యాలయం జె.పి.భవన్‌లో జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడ అధ్యక్షతన శాసనసభ్యుల సమావేశం జరిగింది. సంగొళ్ళి రాయణ్ణ రైల్వేస్టేషన్‌ నుంచి ఆనందరావ్‌ సర్కిల్‌కు చేరుకొని అక్కడి నుంచి ఫ్రీడం పార్కుదాకా పెద్దఎత్తున ఆందోళన చేయదలచారు. శాసనసభలోనూ నిరంతరంగా ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. ప్రతిపక్షాలు ప్రధానంగా వరద పరిహారంలో జాప్యం, ఉద్యోగులు, అధికారుల బదిలీల్లో పైరవీలు వంటి అంశాలపై సభలో ప్రస్తావిస్తారని ఊహించిన బీజేపీ ప్రభుత్వ పెద్దలు దీటుగా ఎదుర్కొనేందుకు ప్రతి వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం యడియూరప్ప అధ్యక్షతన విధానసౌధలోని పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అపహాస్యం చేసేందుకు కుట్ర పన్నాయని కలిసి దీటుగా ఎదుర్కుందామని సీఎం పేర్కొన్నారు. మంత్రులంతా హాజరయ్యారు. ఎమ్మెల్యేల్లో ఉమేష్‌ కత్తి, మురుగేష్‌ నిరాణీలు మాత్రమే గైర్హాజరయ్యారు.

Related posts