telugu navyamedia
క్రీడలు వార్తలు

వార్నర్ కు షాక్.. ఇక నుండి సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. అటు బ్యాట్స్‌మెన్‌గా ఇటు కెప్టెన్‌గా విఫలమవుతున్న డేవిడ్ వార్నర్‌పై వేటు వేసి టీమ్ సారథ్య బాధ్యతలను న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు అప్పగించింది. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌ నుంచే విలియమ్సన్ జట్టు సారథ్య బాధ్యతలు చేపడుతాడని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆ మ్యాచ్‌లో ఓవర్‌సీస్ కాంబినేషన్ కూడా మారుతుందని, ఈ మేరకు టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఈ నిర్ణయాన్ని తేలికగా తీసుకోలేదని జట్టు ప్రయోజనల నేపథ్యంలో తప్పనిసరి తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక కొన్నేళ్లుగా డేవిడ్ వార్నర్ జట్టుకు చేసిన మేలును టీమ్‌మేనేజ్‌మెంట్ మరవదని, అతనిపై ఫ్రాంచైజీకి అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేసింది. ఈ సీజన్‌ తదుపరి మ్యాచ్‌ల్లో ఆఫ్ ఫీల్డ్, ఆన్ ఫీల్డ్‌లో డేవిడ్ వార్నర్ సహాయ సహకారాలు అందిస్తాడని ఆశిస్తున్నామని తెలిపింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. అది కూడా పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందింది. మిగతా మ్యాచ్‌లన్నిటినీ చేతులారా చేజార్చుకుంది. ముఖ్యంగా ఢిల్లీతో సూపర్ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో జట్టు ఓటమికి డేవిడ్ వార్నరే కారణమయ్యాడు.

Related posts