telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

కాంచీపురం : .. 40 ఏళ్లకు ఒకసారి జరిగే ఉత్సవాలు.. శయన వరదరాజ పెరుమాళ్‌..

kanchipuram athivaradar utsav

40 సంవత్సరాలకు ఒకసారి జరిగే కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో అత్తివరధర్‌ ఉత్సవాలు వసంత మంటపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అత్తివరధర్‌ శయన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆగస్టు 17 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని అనంత సరస్సు (పుష్కరిణి)లోని నాలుగు కాళ్ల మంటపం నుంచి అత్తివరధర్‌ విగ్రహాన్ని బయటకు తీయడానికి నెల రోజుల కింద పనులు ప్రారంభించారు. శుక్రవారం వేకువజామున 2.30 గంటలకు స్వామివారి విగ్రహాన్ని బయటకుతీసి భారీ భద్రత నడుమ వసంత మంటపానికి తీసుకొచ్చారు.

అనంతరం విగ్రహాన్ని శుభ్రం చేసి మూడు రోజులుగా హోమాలు, తిరుమంజనం, తైలాభిషేకం, విష్ణు పూజలు నిర్వహించారు. సోమవారం వేకువజామున ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామికి ఇడ్లీ, జాంగ్రి తదితర వంటకాలు, పిండి పదార్థాలతో చేసిన నైవేధ్యం సమర్పించి పూజలు చేశారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు ఆలయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నరు బన్వరిలాల్‌ పురోహిత్‌కు దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రన్‌, జిల్లా కలెక్టరు పొన్నయ్య, ఎస్పీ సంతోష్‌, స్థానిక ఎమ్మెల్యే ఎళిలరసన్‌, దేవాదాయ శాఖ అధికారులు, అలయ అర్చకులు స్వాగతం పలికారు.

గవర్నరు కుటుంబ సభ్యులతో కలిసి అత్తివరధర్‌ విశ్వరూప దర్శనం చేసుకోవడంతో ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. అనంతరం ఇతర భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వరుసలో నిలబడి గోవిందా.. అత్తివరధా అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో, వెలుపల భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా వసంత మంటపాన్ని వివిధ రకాల పూలు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.

Related posts