కమల్ హాసన్, శంకర్‌ల క్రేజీ కాంబినేషన్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్న భారతీయుడు-2. 1996 లో వచ్చి సంచలనం రేపిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఎన్నో ఏళ్ల చర్చల తర్వాత సినిమాను మొదలుపెడితే…కమల్‌కు మేకప్ పడక ఒకసారి.. నిర్మాతలు, డైరెక్టర్ మధ్య విభేదాల వల్ల మరోసారి.. కమల్ పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల మరోసారి.. సెట్లో జరిగిన క్రేన్ ప్రమాదం వల్ల ఇంకోసారి షూటింగుకి బ్రేక్ పడింది. ఇప్పుడు కరోనా సంక్షోభం ఎలానూ ఉండనే ఉంది. ఇలా వరుస బ్రేకులు రావడంతో ఈ సినిమా భవితవ్యంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇకపై సినిమా షూటింగ్ జరగకపోవచ్చని.. పూర్తిగా షూటింగ్ ఆపేస్తున్నారని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ వార్తల్ని ఖండిస్తూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇండియన్-2ను సినిమాను ఆపే మాటే లేదని లైకా స్పష్టం చేసింది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయిందని.. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అంత భాగం పూర్తి చేశాక ఎలా ఆపివేస్తామని ఆ సంస్థ ప్రశ్నించింది. సినిమా గురించి బయట సర్కులేట్ అవుతోన్న రూమర్స్ నమ్మొద్దని.. లాక్ డౌన్ ముగిసి సాధారణ పరిస్థితులు వచ్చాక షూటింగ్ తిరిగి ప్రారంభిస్తామని లైకా సంస్థ తెలిపింది.
previous post