telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లోకనాయకుడు కమల్ హాసన్ కు జన్మదిన శుభాకాంక్షలు

Kamal-Haasan

ప్రముఖ నటుడు కమల్ హాసన్ విశిష్ట నటుడే కాదు ఒక విచిత్రమైన వ్యక్తి కూడా. తను నటించే సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత వుండాలని, రొటీన్ పాత్రలకు అది భిన్నంగా వుండాలని కోరుకునే వ్యక్తి. అందుకే అతడు సంచలన దర్శకుడు బాలచందర్ కు సరైన జోడీ అయ్యాడు. కమల్ హాసన్ కేవలం నటుడే కాదు మంచి కథకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత, దర్శకుడు, గాయకుడు … చివరికి అజ్ఞాత సంగీత దర్శకుడు కూడా. దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కూడా తన ప్రత్యేకతను నిలుపుకున్న ఒక మంచి నటుడు కమల్. అద్భుతమైన విభిన్న నటనా శైలితో కమల్ తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే వచ్చారు. ప్రేమలో పడే కఠిన బ్రహ్మచారిగా ‘తేన్ సిందువే వానమ్’ (భలే బ్రహ్మచారి) సినిమాలో; తనకన్నా వయసులో పెద్దదైన భైరవి ని ప్రేమించే ప్రసన్నగా ‘అపూర్వరాగంగళ్’ (తూర్పు పడమర)లో; శృంగార వీరన్ గా ‘మన్మధ లీలై’ (మన్మధలీల)లో; వికలాంగుడైన ప్రేమికుడుగా ‘పత్తినారు వయత్తినిలే’ (పదహారేళ్ళ వయసు)లో; తెలుగు యువతిని ప్రేమించి ప్రాణత్యాగం చేసే తమిళ బ్రాహ్మణ యువకుడుగా ‘మరోచరిత్ర’లో; ఒక డాక్టర్ గా, ప్రేమికుడుగా ద్విపాత్రాభినయం చేస్తూ ‘సొమ్మొకడిది సోకొకడిది’ చిత్రంలో; శాడిస్టు భర్తనుంచి కాపాడే జానీగా ‘ఇది కథ కాదు’ లో; నిరుద్యోగ యువకునిగా ‘ఆకలిరాజ్యం’లో; కవల సోదరులుగా ‘అభయ్’ (ఆలవందాన్) లో; వికలాంగుడైన మానవతా వాదిగా ‘సత్యమే శివం’ లో; సర్కస్ పోరాటాలు చేసే బధిరుడుగా ‘ముంబై ఎక్స్ ప్రెస్’ లో, మాఫియా నాయకుడు వరదరాజన్ మొదలియార్ గా ‘నాయకన్’లో; నృత్యంలోనే దుఃఖాన్ని, ప్రేమని చవిచూసే నిస్వార్ధ కళాకారునిగా ‘సాగర సంగమం’లో; మానసిక వికలాంగునిగా‘ స్వాతిముత్యం’లో; అవినీతిపరుడైన మేయర్ గా ‘ఇంద్రుడు చంద్రుడు’లో; నమ్మకస్తుడైన బెస్తవానిగా ‘శుభసంకల్పం’లో; విభిన్న పాత్రలతో మెప్పించే ‘దశావతారాలు’లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన శైలిని నిలబెట్టుకున్న నటుడాయన. చలన చిత్రరంగానికి ఆయన ఒక ‘వసూల్ రాజా’. ‘భారతీయుడు’ సినిమా రెండు వందల మిలియన్లు ఆర్జించి పెట్టిన విషయం ఈ మాటను నిజం చేసింది. దర్శకుడు కె. విశ్వనాథ్ మెచ్చిన నటుడు కమల్ హాసన్. నవంబరు 7 న కమల్ హాసన్ కు 66 ఏళ్ళు నిండుతున్నాయి. ఆ జన్మదిన సందర్భంగా కమల్ ను గుర్తుచేసుకుందాం…

Kamal Hasan

ఆసుపత్రి నుంచే బాల నటుడుగా…
1960లో ఎ.వి.ఎం. అధినేత మెయ్యప్ప చెట్టియార్ తమిళంలో ‘కళత్తూర్ కన్నమ్మ’ సినిమా నిర్మించారు. భీమ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సావిత్రి, జెమిని గణేశన్ నాయికా నాయకులు. అందులో ఒక బాలుడి పాత్రకోసం అన్వేషిస్తున్న మెయ్యప్పకు మద్రాసు జనరల్ ఆసుపత్రిలో ఒక పిల్లాడు తటస్థపడ్డాడు. అయితే అది మెయ్యప్పకు కాదు… వాళ్ళావిడకు. ఐదేళ్ళ వయసులో పరమక్కుడి కి చెందిన ఆ బాలుడికి సైనస్ సమస్య తలెత్తగా మద్రాసు జనరల్ ఆసుపత్రిలో చేర్చి వైద్యం ఇప్పిస్తున్నప్పుడు ఆ అబ్బాయి కలివిడిగా ఆసుపత్రి మొత్తం చుట్టివస్తూ, అందరినీ పలకరిస్తూ, ముద్దుముద్దు మాటలు వల్లిస్తూ ఉండేవాడు. ఈ పిల్లాడికి వైద్యం అందించే డాక్టర్ వద్దకు మెయ్యప్ప చెట్టి భార్య కూడా వైద్య సలహా నిమిత్తం వస్తుండేది. ఈ బాలుడు ఆమెకు కూడా తారసపడి కబుర్లు చెప్పడంతో, ఆమె తన భర్తకు ఈ అబ్బాయిని గురించి చెప్పింది. ఆ కుర్రాణ్ణి స్టూడియోకి తీసుకెళ్ళి స్క్రీన్ టెస్టులు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు స్టూడియో సిబ్బంది. ఇంకేముంది ఆ బాలుడు ‘కళత్తూర్ కన్నమ్మ’ సినిమాలో నటించాడు. ఆ బుడతడే మాస్టర్ కమల్ హాసన్. ఈ సినిమాను తెలుగులో ‘మావూరి అమ్మాయి’ పేరుతో ఎం.ఆర్.ఎం సంస్థ పేరిట మెయ్యప్ప కుమారులు అనువదించి 1960 అక్టోబరులో ఆంధ్రదేశంలో విడుదల చేశారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ బాలనటుడు గా కమల్ హాసన్ రాష్ట్రపతి చేతులమీదుగా బంగారు పతకం అందుకున్నాడు. ఇదే సినిమాను ఎ.వి.ఎం వారే 1962లో హిందీలో ‘మై చుప్ రహూంగీ’ పేరుతో పునర్నిర్మించగా అందులో మీనాకుమారి, సునీల్ దత్ జంటగా నటించారు. కమల్ పాత్రను హిందీలో బబ్లూ పోషించాడు. తరవాత 1969లో ఇదే సినిమాను తెలుగులో ‘మూగనోము’ (1969) పేరుతో అక్కినేని-జమున జంటగా సినిమా నిర్మించారు. కమల్ హాసన్ పోషించిన బాలుని పాత్రను మాస్టర్ బ్రహ్మాజీ పోషించాడు.

Kamal Hasan

కమల్ హాసన్ అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్. నవంబరు 7, 1954 న కమల్ హాసన్ తమిళనాడు లోని రామనాథపురానికి చేరువలో వున్న పరమక్కుడి పట్టణంలో జన్మించాడు. తండ్రి డి. శ్రీనివాసన్ న్యాయవాద వృత్తిలో వుండేవారు. కమల్ తల్లి రాజలక్ష్మి మంచి డ్యాన్సర్. కమల్ ప్రాధమిక విద్యాభ్యాసం పరమక్కుడి లోనే జరిగింది. తరవాత వారి కుటుంబం మద్రాసులో స్థిరపడింది. మైలాపూరు లోని శాంథోమ్ పాఠశాలలో కమల్ చదువు కొనసాగింది. అప్పట్లో కమల్ తల్లి నాట్యగురు తంగప్పన్ వద్ద నృత్యం నేర్చుకుంటూ వుండేది. ఆ సమయంలోనే కమల్ చదువుకుంటూనే కొన్ని సినిమాలలో చిన్నచిన్న పాత్రలు పోషిస్తూ ఉండేవాడు. అలా 1970 లో విడుదలైన శాండో చిన్నప్ప దేవర నిర్మించిన ‘మాణవన్’ చిత్రంలో కమల్ హాసన్ కుట్టి పద్మిని చేసే డ్యాన్స్ సన్నివేశంలో ఆమెతో కలిసి కనిపిస్తాడు. డ్యాన్స్ డైరెక్టర్ తంగప్పన్ నిర్మించి దర్శకత్వం వహించిన ‘అణ్నై వేలంకణ్ణి’ సినిమాలో కాసేపు జీసస్ క్రైస్ట్ గా కనిపిస్తాడు. కమల్ కొంతకాలం తంగప్పన్ వద్ద సహాయకుడిగా ఉంటూ డ్యాన్స్ నేర్చుకున్నాడు. 1973లో ముత్తురామన్ నిర్మించిన ‘కాశి యాతిరై‘ సినిమాలో తంగప్పన్ కు సహాయ డ్యాన్స్ డైరెక్టర్ గా పనిచేశాడు. అదే సంవత్సరం కె. బాలచందర్ తొలిసారి కమల్ హాసన్ చేత ‘సొల్లత్తాన్ నినిక్కిరేన్’ అనే సినిమాలో ఒక ప్రతినాయకుడి గా ప్లేబాయ్ పాత్రను పోషింపజేశారు. తరవాత ‘అరంగేట్రం’ సినిమాలో మంచి పాత్రను ఇచ్చారు. ఈ సినిమా విజయంతో హిందీలో పునర్నిర్మింపబడిన ‘ఆయినా’ సినిమాలో రాజేష్ ఖన్నా తోబాటు కమల్ కూడా నటించడం జరిగింది. హిందీలో కమల్ నటించిన తొలి చిత్రం ఇదేకావడం విశేషం. తరవాత కమల్ హాసన్ 1974లో తమిళంలో చాలా సహాయక పాత్రలు పోషిస్తూ వచ్చాడు. వాటిలో ‘గుమస్తావిన్ మగళ్’, ‘అవర్ ఒరు తొడర్ కథై’ (తెలుగులో అంతులేని కథ), ‘నాన్ అవనిల్లై’ సినిమాలు ముఖ్యమైనవి. అదే సంవత్సరం కమల్ కు సేతుమాధవన్ మలయాళం లో నిర్మించిన ‘కన్యాకుమారి’ సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. అందులో రీటా భాదురి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో నటనకు కమల్ తొలి ఫిలింఫేర్ బహుమతి అందుకున్నాడు. అంతకు ముందు కమల్ 1962లో ‘కణ్ణుమ్ కరళుమ్’ అనే మళయాళ చిత్రంలో బాలనటుడిగా నటించాడు. 1975లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ (తెలుగులో తూర్పు-పడమర) సినిమా కమల్ హాసన్ కు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చింది. రజనీకాంత్ ఈ సినిమాతోనే తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాకు మూడు జాతీయ బహుమతులు (తమిళంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయా గ్రహణం, ఉత్తమ నేపథ్య గాయని వాణిజయరాం), మూడు ఫిలింఫేర్ బహుమతులు (ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు-కమల్ హాసన్) దక్కాయి. కమల్ కు ఇది రెండవ ఫిలింఫేర్ బహుమతి కావడం విశేషం.

manmadha-leelai

మన్మధలీలై తో స్టార్డం…
బాలచందర్ దర్శకత్వంలో 1976 లో ‘మన్మధ లీలై’ అనే సినిమా వచ్చింది. అందులో కమల్ హాసన్ హీరో. ఈ సినిమా తోనే జయప్రద, వై. విజయ, హేమాచౌదరి తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మన్మధలీల’ గా, హిందీలో ‘మీఠీ మీఠీ బాతే’ గా 1977లో డబ్ చేశారు. ఈ చిత్రం కమల్ కు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచి అతనికి హీరోగా మంచి హోదా కలిపించింది. “ఈ చిత్రం పదేళ్ళ తరవాత వచ్చివుంటే సూపర్ డూపర్ హిట్ గా నిలిచి వుండేది” అని, సినిమా నేపథ్యాన్ని విశ్లేషించిన సినీ పండితులు చెప్పారు. ఈ సినిమా తరవాత వచ్చిన ముత్తురామన్ సినిమా ‘ఒరు ఉధప్పు కన్ సిముట్టిగిరదు’ లో కమల్ హాసన్, సుజాత నటించారు. కమల్ హాసన్ కు మూడవసారి ఫిలింఫేర్ బహుమతి తెచ్చిపెట్టిన చిత్రమిది. ఈ రెండు సినిమాలతో కమల్ తమిళ చిత్రరంగంలో స్థిరపడిపోయారు. తరవాత వచ్చిన మరో బాలచందర్ సినిమా ‘అవర్గళ్’ (తెలుగులో ఇది కథకాదు) కమల్ హాసన్ హోదాను పెంచింది.

బాలచందర్ దర్శకత్వం వహించిన మరొక చిత్రం ‘మూండ్రు ముడిచ్చు’(ఓ సీత కథ) కూడా మంచి హిట్టయింది. ఈ సినిమా ద్వారా శ్రీదేవి 13 ఏళ్ళ ప్రాయంలో హీరోయిన్ గా నటించింది. రజనీకాంత్ విలన్ పాత్ర పోషించాడు. భారతీరాజా దర్శకత్వం వహించిన ‘పత్తినారు వయత్తినిలే’ (పదహారేళ్ళ వయసు) లో కమల్ హాసన్ పోషించిన పాత్రకు ఫిలింఫేర్ అవార్డు తోబాటు తమిళనాడు రాష్ట్ర బహుమతి కూడా లభించింది. గాయని జానకి కి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు లభించింది. కమల్ హాసన్ కన్నడంలో బాలుమహేంద్ర నిర్మించిన ‘కోకిల’ సినిమాలో తొలిసారి నటించారు. అదే సంవత్సరం ‘అవళ్ ఒరు తొడర్ కథై’ సినిమాను ‘కబిత’ పేరుతో బెంగాలి భాషలో పునర్నిర్మిస్తే అందులో హీరోగా కమల్ నటించారు.

Maro-Charitra

తెలుగులో కమల్ ది మరోచరిత్ర…
కమల్ హాసన్ తెలుగులో నటించిన తొలి స్ట్రెయిట్ సినిమా ‘అంతులేని కథ’ (1976). అప్పుడే ‘మన్మధలీల’ డబ్బింగ్ వర్షన్ కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాలు ఆంధ్రరాష్ట్రంలో శతదినోత్సవాలు చేసుకున్నాయి. కాగా ‘మరోచరిత్ర’. సినిమా రెండవ స్ట్రెయిట్ చిత్రం. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ సరసన సరిత నటించగా, మాధవి ఒక ప్రత్యేక పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్రాన్ని బాలచందర్ హిందీలో ‘ఏక్ దూజే కేలియే’ చిత్రంగా నిర్మిస్తే ఆ సినిమా రికార్డులమీద రికార్డులు సృష్టించింది. గాయకుడు బాలు కి జాతీయ బహుమతి తెచ్చిపెట్టింది. కమల్ నటించిన ఎక్కువ తెలుగు సినిమాలకు బాలు డబ్బింగ్ చెప్పేవారు. కమల్ హాసన్ ను తెలుగు సినిమాకు హీరోగా పరిచయం చేయడమే ముఖ్యలక్ష్యంతో బాలచందర్ ‘మరోచరిత్ర’ సినిమాకు రూపకల్పన చేశారు. కమల్ కు తమిళం మాతృభాష కావడంతో ఇందులో హీరోని తమిళుడుగా మార్చారు. సినిమా మొత్తాన్ని విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోనే తీశారు. బాలచందర్ కు ఉత్తమ దర్శకుడుగా ఫిలింఫేర్ బహుమతి లభించింది. ఈమూడు సినిమాల హ్యాట్రిక్ విజయంతో తెలుగు చలనచిత్ర నిర్మాతలు కమల్ తో సినిమాలు తీసేందుకు ముందుకొచ్చారు. ఈ సినిమా మద్రాసు లోని సఫైర్ థియేటర్ లో 596 రోజులు, బెంగుళూరులో 300 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. CNN-IBN సంస్థ ఈ చిత్రాన్ని ‘100 గ్రేట్ ఇండియన్ మూవీస్’ జాబితాలో చేర్చింది. అప్పుడే భారతీరాజా కమల్ హీరోగా, శ్రీదేవి హీరోయిన్ గా ‘సిగప్పు రోజాక్కళ్’ సినిమా నిర్మించారు. అందులో కమల్ ది సీరియల్ కిల్లర్ పాత్ర.

Sigappu

ఆ సినిమాలో నటనకు కమల్ హాసన్ నాల్గవసారి ఫిలింఫేర్ బహుమతి గెలుచుకున్నారు. 175 రోజులకు పైగా ఆడిన ఈ సినిమా ద్వారా భారతీరాజాకు ఫిలింఫేర్ వారి ఉత్తమ దర్శకుని బహుమతి లభించింది. ఈ చిత్రాన్ని భారతీరాజా హిందీలో ‘రెడ్ రోస్’ (1980) పేరుతో పునర్నిర్మించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెలుగులో ‘సొమ్మొకడిది సోకొకడిది’ పేరుతో సినిమా నిర్మించారు. అందులో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయగా ఆయన సరసన జయసుధ, రోజారమణి హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను తమిళం లోకి ‘ఇరు నిలవుగళ్’ పేరుతో డబ్ చేస్తే అక్కడ కూడా హిట్ గా నిలిచింది. 1970 దశకంలో కమల్ హాసన్ కు ఆరు ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. 1981 లో బాలచందర్ తెలుగులో ‘ఆకలి రాజ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. అందులో కమల్ హాసన్ సరసన శ్రీదేవి నటిచింది. ఈ సినిమా సూపర్ హిట్టయింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘అమావాస్య చంద్రుడు’ కూడా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇందులో ఎల్.వి. ప్రసాద్ నటించడం విశేషం. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సాగర సంగమం’ సూపర్ డూపర్ హిట్టయింది. అదే ఊపులో వచ్చిన ‘స్వాతి ముత్యం’ అత్యధిక మహిళా ప్రేక్షకులను ఆకట్టుకొని విజయవంతమైంది. సింగీతం శ్రీనివాసరావు కమల్ హాసన్ తో సంభాషణలు లేకుండా ‘పుష్పక విమానం’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన ప్రయోగం సఫలమైంది. విశ్వనాథ్, బాలు కలిసి కమల్ హాసన్ తో ‘శుభసంకల్పం’ చిత్రాన్ని నిర్మిస్తే అదికూడా శతదినోత్సవం చేసుకుంది. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా ‘ఇంద్రుడు చంద్రుడు’. అందులో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. ‘భామనే సత్యభామనే’ కూడా ఆకోవలోనిదే.

Kamal Hasan

విజయవంతమైన డబ్బింగులు…
కమల్ హాసన్ నటించిన ఎన్నో తమిళ సినిమాలు తెలుగులోకి అనువదించబడి విజయవంతమై శతనోత్సవాలు కూడా జరుపుకున్నాయి. బాగా విజయవంతమైన డబ్బింగ్ సినిమాల జాబితా చాంతాడంత వుంటుంది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి… గురు, అందగాడు, వసంత కోకిల, నాయకుడు, అపూర్వ సహోదరులు, గుణ, క్షత్రియ పుత్రుడు, మహానది, భారతీయుడు, క్షత్రియ పుత్రుడు, మైఖేల్ మదన కామరాజు, సతి లీలావతి, దశావతారాలు మొదలైనవి. అలాగే హిందీలో కమల్ హాసన్ నటించిన సినిమాల జాబితా గమనిస్తే అది కూడా పెద్ద చిట్టానే అవుతుంది. వాటిలో కొన్ని… సద్మా, ఏ తో కమాల్ హోగయా (త్రిపాత్రాభినయం), ప్యార్ తరానా(డబ్బింగ్), ఏక్ నయీ పహేలీ, రాజ్ తిలక్, యాద్ గార్, కరిష్మా, సాగర్, దేఖా ప్యార్ తుమ్హారా, హిందూస్తానీ, చాచీ 420 మొదలైనవి. కమల్ హాసన్ నటించిన కొన్ని సినిమాలు అటు హిందీ ఇటు తమిళంలో కూడా నిర్మింపబడ్డాయి. వాటిలో ‘హే రామ్’, ‘అభయా’, ‘ముంబాయ్ ఎక్స్ ప్రెస్’ చిత్రాలను ముఖ్యంగా చెప్పుకోవాలి.

కమల్ పాత్రల ప్రత్యేకతలు…
కమల్ హాసన్ కు వైవిధ్యమైన పాత్రలు పోషించడమంటే సరదా. కళ్యాణ రామన్ చిత్రంలో ఎత్తుపళ్ళతో పల్లెటూరివాని పాత్రను పోషించారు. రాజా పార్వై చిత్రంలో అంధ వయోలనిస్టు పాత్రలో జీవించారు. ఈ చిత్రానికి కమల్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం. స్వాతిముత్యంలో మానసిక వికలాంగునిగా, సాగర సంగమంలో శాస్త్రీయ నృత్యకళాకారునిగా, నాయకుడు సినిమాలో అండర్ వరల్డ్ డాన్ గా ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. పుష్పక విమానం సినిమాలో నిరుద్యోగ యువకునిగా, వారం రోజులపాటు భోగ భాగ్యాలు అనుభవించే అవకాశం వచ్చిన యువకునిగా నటించారు. విచిత్ర సోదరులు సినిమాలో మరగుజ్జు అవతారం ఎత్తారు. ఈ స్పూర్తితోనే షారుఖ్ ఖాన్ కూడా మరగుజ్జు పాత్రలో కనిపించాడు. భామనే సత్యభామనే చిత్రానికి శంతన్ పెనోయ్ దర్శకుడు. కానీ అతని పనితనం కమల్ కు నచ్చలేదు. వెంటనే అతణ్ణి తొలగించి తనే దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి సినిమాను హిట్ చేశారు. గుణ చిత్రంలో కమల్ ది అద్భుతమైన పాత్ర. ప్రేమలో పడిన ఉన్మాదిగా నటించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. ద్రోహి చిత్రంలో ఉగ్రవాదాన్ని అణచివేసే పోలీసు అధికారిగా కమల్ హాసన్ నటన అపూర్వం. అలాగే భారతీయుడు సినిమాలో స్వాతంత్ర సమరయోధుని పాత్రలో ముసలి వేషం, లంచగొండి అధికారిగా రెండవ వేషం వేసి రాణించిన గొప్ప నటుడు కమల్ హాసన్. తొంభయ్యవ దశకంలో కమల్ నటించిన ఎక్కువ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అందుకు రెండువేల దశకం కూడా మినహాయింపు కాదు. కఠిన బ్రహ్మచారిగా, పంచతంత్రంలో రసికుడైన విమాన చోదకునిగా, సత్యమే శివం చిత్రంలో వికలాంగుడైన మానవతావాదిగా, పోతురాజు సినిమాలో అన్యాయంగా హత్య కేసులో ఇరికించ బడిన పల్లెటూరి బైతుగా, తెనాలి చిత్రంలో చిన్న దానికి కూడా భయపడే పిరికివాడుగా విభిన్న పాత్రలు పోషించి సఫలుడైనా, సినిమాలు మాత్రం ఆశించినంత విజయవంతం కాలేకపోయాయి. రాజ్ కమల్ పేరుతో సొంత సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పి ‘రాజా పార్వై’, ‘అపూర్వ సహోదరగళ్’, ‘దేవర మగన్’, ‘కురుదిప్పునళ్’, విరుమాండి’, ‘ముంబై ఎక్స్ ప్రెస్’ సినిమాలు సొంతంగా నిర్మించారు.

Kamal Hasan

పురస్కారాలు… సంసారం…
జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ ‘మూండ్రాంపిరై’ (వసంత కోకిల), ‘నాయగన్’ (నాయకుడు) ‘ఇండియన్’ (భారతీయుడు) సినిమాలో నటనకు మూడుసార్లు పురస్కారాలు అందుకున్నారు. తెలుగు చిత్రాలు సాగరసంగమం, స్వాతిముత్యం ఆసియా చలనచిత్రోత్సవాలలో ప్రదర్శనకు నోచుకొని ఉత్తమ బహుమతులు గెలుచుకున్నాయి. ఫిలింఫేర్ బహుమతులు ఏకంగా పద్దెనిమిది సార్లు గెలుచుకున్న ఏకైక నటుడు కమల్ హాసన్. కమల్ నటించిన ఆరు సినిమాలు ఆస్కార్ బహుమతికోసం ప్రభుత్వ పక్షాన ఎంపికై, పోటీల్లో పాల్గొన్నాయి. 1990 లో కేంద్ర ప్రభుత్వం కమల్ హాసన్ ను పద్మశ్రీ పురస్కారం తోను, 2014 లో పద్మభూషణ్ పురస్కారం తోను సత్కరించింది.

Kamal Hasan

తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదు ప్రదానం చేసింది. చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం కమల్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. మొత్తం మీద కమల్ స్వీకరించిన అవార్డులు 170 కి పైమాటే! కమల్ హాసన్ తొలుత నాట్య కళాకారిణి వాణీ గణపతి ని వివాహమాడారు. తరవాత సారిక తో సంసారం సాగించారు. ఆమెకు కూడా స్వస్తిపలికి నటి గౌతమి తో సహజీవనం సాగించారు. కమల్ కు సారిక ద్వారా ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఒకరు బాలీవుడ్ నటి శ్రుతి హసన్ కాగా, రెండవ కూతురు అక్షర. కమల్ హాసన్ వివాదాలకు కేంద్ర బిందువు కూడా! ‘తేర్ మగన్’ సినిమాలో తెవర్ కులస్తులను హింసను ప్రోత్సహించేవారిగా చూపి వివాదాస్పదుడయ్యారు. ‘హే రామ్’ సినిమాలో సంఘ్ పరివార్ పాత్రను తక్కువచేసి చూపారని ఆ సంఘ సభ్యులు గొడవ చేశారు. విశ్వరూపం సినిమాలో ఇస్లాం మతాన్ని తక్కువ చేసి చూపారనే వివాదం బహిరంగమైంది. ఏది ఏమైనా కమల్ హాసన్ భారతీయ చలనచిత్ర రంగానికి భగవంతుడు ప్రసాదించిన ఒక గొప్ప కళాకారుడు. కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయ నాయకుడుగా కూడా ఎదుగుతున్నాడు.

-ఆచారం షణ్ముఖాచారి

Related posts