telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మంత్రి కాకాణికి లోన్ యాప్ వేధింపులు..నలుగురి అరెస్ట్

లోన్ యాప్ ఆగడాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సూచించారు. యాప్‌ల ద్వారా లోన్‌లు తీసుకుని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.

ముత్తుకూరులో గడపగడపకు కార్యక్రమంలో ఉండగా 79 కాల్స్ తన నంబర్కు వచ్చాయని తెలిపారు. లోన్ తీసుకున్న అశోక్ కుమార్ అనే వ్యక్తి ప్రత్యామ్నాయ నంబర్‌గా తన సెల్ నంబర్ ఇవ్వడంతో సదరు లోన్ యాప్ ప్రతినిథులు పలుమార్లు తనకు ఫోన్ చేశారని చెప్పారు

ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురిని అరెస్ట్ చేశారని చెప్పారు. లోన్ యాప్ నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే పోలీసులకు లేదా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

అసలేం జరిగిందంటే..?

చెన్నైలోని కోల్‌ మన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ పలు బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీలకు రుణాల రికవరీ ఏజెన్సీగా పనిచేస్తోంది. నెల్లూరులోని రామలింగాపురంలో ఒక ఫైనాన్స్‌ సంస్థ నుంచి పాతపాటి అశోక్‌ కుమార్‌ అనే వ్యక్తి రూ.8.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో చెన్నైలోని కోల్‌ మన్‌ కంపెనీ సంస్థని సదరు ఫైనాన్స్ సంస్థ ఆశ్రయించింది. అశోక్ కుమార్ మొబైల్ నెంబర్ ఇచ్చి, మొండి బాకీ వసూలు చేయాలని చెప్పింది. దీంతో ఆ ఏజెన్సీ రంగంలోకి దిగింది.

రికవరీ ఏజెన్సీ మేనేజర్లు ప్రసాద్‌ రెడ్డి, మహేంద్రన్‌, పెంచలరావు, టీం లీడర్‌ మాధురి వాసు కలిసి రికవరీకోసం ప్రయత్నించారు. అశో కుమార్ ఫోన్ బుక్ ఆధారంగా అందులో ఉన్న నెంబర్లకు ఫోన్లు చేశారు. అందులో మంత్రి కాకాణి ఫోన్ నెంబర్ కూడా ఉండటంతో కాల్ కాకాణికి వెళ్లింది. ఆ సమయంలో ఆ ఫోన్ ఆయన పీఏ శంకరయ్య దగ్గర ఉంది. బెదిరించినట్టుగా మాట్లాడటంతో శంకరయ్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

Related posts