telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

అదో చిన్న కచోరి షాపు… కానీ జీఎస్టీ కట్టాల్సినంత ఆదాయం.. ఏడాదికి 70లక్షలపైనే..

kachori shop needs to pay gst

అది ఒక చిన్న కచోరి షాపు, ఉత్తర్ ప్రదేశ్‌లో ఉంది. ఆ షాపు తెరిస్తే చాలు ఆ కచోరి రుచి మరిగిన వారు పెద్ద క్యూలో నిలబడతారు. నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో ఆ దుకాణం యజమానికి లాభాలే లాభాలు. కాసులు ఇట్టే పోసుకున్నాడు. అలీగఢ్‌లో ఉండే ఆ దుకాణంపై కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్ కన్నేసింది. దానిపై ఆరా తీస్తే దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్‌ అలీగఢ్‌లోని రోడ్డుపక్కన ముఖేష్ కుమార్ అనే వ్యక్తి కచోరి దుకాణం పెట్టుకున్నాడు. కచోరీ షాపు నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో ఏడాదికి టర్నోవర్ రూ.60 లక్షల నుంచి 70 లక్షల రూపాయలు వస్తోంది. అయితే రోడ్డుపక్కన షాపే కదా అని ముఖేష్ కుమార్ పన్ను ఎగవేశాడు. ఎందుకో వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ముఖేష్‌పై అనుమానం వచ్చింది. వెంటనే ఆయన గురించి ఆరా తీశారు. విచారణ చేశారు. దీంతో ఆయన కోటీశ్వరుడని తేలింది. అంతేకాదు తాను నడుపుతున్న కచోరీ షాపుకు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ కూడా లేదు. ఈ కచోరీ షాపును ముఖేష్ గత 12 ఏళ్లుగా నడుపుతున్నాడు. షాపును పెట్టిన కొద్ది రోజుల్లోనే మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు.

కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర పాల్ సింగ్, ముఖేష్ కుమార్ నిర్వహిస్తున్న కచోరీ షాప్‌ పై రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆయా సమయాల్లో కస్టమర్ల రద్దీ ఎలాగుంటుందనే దానిపై నిఘా ఉంచామని చెప్పారు. ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత జూన్ 21న సెర్చ్ వారెంట్‌తో వచ్చి షాపుపై దాడులు చేశామని చెప్పారు. రెక్కీ సమయంలోనే తన ఆదాయం లక్షల్లో ఉంటుందని ముఖేష్ చెప్పాడని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ముడిసరుకులు, కస్టమర్ల రద్దీలను పరిగణలోకి తీసుకుని ముఖేష్ లాభాలపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. లక్నో నుంచి ఫిర్యాదు అందడంతో వెంటనే సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు రవీంద్రపాల్ తెలిపారు. అధికారుల అంచనా ప్రకారం తన టర్నోవర్ కోటి రూపాయలకు మించి ఉంటుందని తెలుస్తోంది.

20 లక్షల రూపాయల టర్నోవర్ కలిగి ఉన్న వ్యాపారస్తులు జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పని సరిగా చేయించుకోవాలని నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు రవీంద్ర పాల్. మార్చి 31 నాటికి ముఖేష్ కుమార్ కచోరి వ్యాపారం టర్నోవర్ రూ.40 లక్షలుగా ఉన్నట్లు తాము గుర్తించినట్లు రవీంద్రపాల్ తెలిపారు. అయినా జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేదని వివరించారు. వెంటనే ముఖేష్‌కు నోటీసులు ఇవ్వగా తాను జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడని రవీంద్రపాల్ తెలిపారు. ఇప్పుడు ఒక్క ముఖేష్ కుమార్ పేరు మాత్రమే బయటపడిందని అలీగఢ్ మొత్తం దాదాపు 600 కచోరీ దుకాణాలు ఉన్నాయని వాటన్నిటిపై నిఘా ఉంచుతామని కమర్షియల్ ట్యాక్స్ డిప్యేటీ కమిషనర్ రవీంద్రపాల్ తెలిపారు.

Related posts