పోరాడే ప్రతి ఒక్కడూ “కాలా”నే

34

కాలా సినిమాలోని స్త్రీలు అబలలు కాదు. వీరత్వానికి ప్రతీకలు. స్త్రీ అంగాంగాన్ని ఒక వ్యాపార వస్తువుగా చూపించే మూస సినిమాలకు భిన్నంగా స్త్రీ పాత్రలను ఒక ధిక్కార స్వరంగా మనకు చూపించిన రంజిత్ నిజంగా ఒక గొప్ప దర్శకుడు.
సినిమా మొదట్లోనే ఒక యానిమేషన్ ఉంటుంది. నేల కోసం ఆదిమకాలం నుండి జరిగిన పోరాటాల్లో స్త్రీలు , మగవారితో సమానంగా పోరాడటం కనిపిస్తుంది. తర్వాత పితృస్వామ్యంలో స్త్రీ ని శూద్రురాలుగా జమకట్టి బానిసగా మార్చారు.
ఈ నేల ఎవడి సొత్తు కాదు. ఈ నేల అందరిదీ.. చరిత్ర ఆసాంతం నేల కోసం జరిగిన పోరాటాలే..”నేల నా జన్మహక్కు” అనే నినాదంతో సినిమాను నడిపించడం అద్భుతం.
అన్యాయాన్ని ఎదిరించే ప్రతి ఒక్కడు రావణుడే అని చెప్పడం సినిమా చివరలో విలన్ రాముడి పూజలో ఉండి తన మనుషులతో కాలా నివసించే ఏరియాలో దొంగ దెబ్బ తీయడం లాంటి సన్నివేశాలు రామాయణంతో పోలికను చూపిస్తాయి. ఆర్య మనువాద శక్తులు ఎంతటి విధ్వంసం చేసి ఇక్కడి నేలను ఆక్రమించాయో చక్కగా చూపించాడు. కాలా భార్య సెల్వి, చిన్నకొడుకు చనిపోయినపుడు పిండాలు పెట్టడం కర్మ చేయడం వంటివి కాకుండా ” జ్ఞాపకార్థ సభ” ఏర్పాటు చేసే సీన్ అందరూ ఆలోచించేలా ఉంది. పిండాలు , కర్మలు మనువాదం బతకడానికి తప్ప ఎందుకూ పనికిరావు.

“షేక్ హాండ్ సమానత్వానికి గుర్తు . కాళ్లు పట్టుకోడం బానిసత్వానికి చిహ్నమని జరీనా పాత్ర హరిదాసు పాత్రతో అంటుంది.
అలాగే ” కాలా” కూడా ఎంత బలవంతపెట్టినా కాళ్లు పట్టుకోడు. అది ఆత్మగౌరవం అంటే..
ఒక్కరుగా ఏమీ సాధించలేము సమిష్టిగా చేసే పోరాటాలే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆయుధమని చెప్పడమే కాలా సినిమా.
కాలాకు కాబోయే చిన్నకోడలు పోలిసులు తన చుడీదార్ క్రింది వస్త్రం పైజామాను లాగి విసిరితే .. , పాకుతూ వెళ్లి ఆ వస్త్రాన్ని కాక ఒక కర్రను అందుకుని తిరిగి ప్రతిఘటించినట్టు చూపించాడు దర్శకుడు.. ఏ స్త్రీ అయినా అన్యాయం జరిగినప్పుడు ఏడుస్తూ కూర్చోవడం కాదు తిరగబడటమే అసలైన స్త్రీ శక్తి.
ఇక చివరగా నీలి విప్లవమే మనువాదాన్ని ఎదిరించడానికి ఆయుధమని అంతర్లీనంగా మనకు చెప్పిన అంబేద్కర్ వారసుడు పా. రంజిత్ ..

హీరో క్లైమాక్సు లో విలన్ ను ఇరగ తంతేనే ప్రేక్షకులకు నచ్చుతుంది కదూ..! కాలా ఒక వీరుడు.. వీరుడికి చావు లేదు. పోరాడే ప్రతి ఒక్కడూ కాలానే. క్లైమాక్సు కొందరికి అర్థం కాదు..ఎందుకంటే విలన్ ను హీరో చంపడు. నలుపు రంగు , ఎరుపురంగు , నీలిరంగు కలిసి ఇంద్రధనుసై విలన్ చనిపోయినట్టు చూపడం ఏంటి…?
వేల ఏళ్లుగా మనువు కుట్రతో , కుతంత్రాలతో మతం మాటున విధ్వంసం తో గెలుస్తూనే ఉన్నాడు. రామాయణ కాలం నుండీ జరుగుతున్నది ఇదే. అన్యాయాన్ని ఎదిరించిన రావణుడు, బలి చక్రవర్తి , తాటక, శూర్పణఖ లాంటి ద్రవిడ వీరులను అసురులుగా చిత్రీకరించిన పురాణాలే ఈ దేశ సంస్కృతిగా మార్చబడిన కాలమిది. ఇలాంటి పరిస్థితుల్లో మనుధర్మమే పునాదిగా బతికే రాజ్యం అంతం అంత సులభం కాదు.

నలుపు రంగు నిరసనకు సంకేతం..ఎరుపు విప్లవానికి గుర్తు.. నీలిరంగు అంబేద్కరిజానికి చిహ్నం. అంబేద్కర్ ఆలోచనా విధానమే మనువాదాన్ని మట్టుపెట్టగలదు.
ఒక నిరసన నుండి విప్లవం పుట్టి అది నీలిరంగు ఉద్యమమై ఆ వెల్లువలో ఆర్య సంస్కృతి వికృత శిశువులైన రాజకీయ మనువులంతా కొట్టుకపోవాలని ఆలోచన చేసిన పా రంజిత్ నా దృష్టిలో గొప్ప దర్శకుడు. సినిమా అయినా, కళ అయినా వినోదం కోసమే కావచ్చు కాని ఆలోచింపచేసే కళ మాత్రం ఒక మంచి పుస్తకంతో సమానం.
మరొక్కమాట రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు నా దృష్టిలో గొప్ప సినిమాలు కావు ఎందుకంటే దోపిడీ వర్గాలు దళిత బహుజనుల , సామాన్య ప్రజల సమస్యలను ఇతివృత్తాలుగా సినిమా తీసేది కోట్లు కొల్లగొట్టడానికే తప్ప నిజంగా సమస్య వచ్చినపుడు సామాన్యుల పక్కన నిలబడేవారు కాదు.

కొంతమందికి నచ్చినా , నచ్చకున్నా కాలా గొప్ప సినిమా. కాలా హీరో రజనీకాంత్ కాదు. దర్శకుడే హీరో. రజనీకాంత్ ఈ సినిమాలో నటించాక అయినా ఆయనకు పట్టిన బాబాల ఆధ్యాత్మిక పిచ్చి వదిలితే బావుండు… ఈసారి హిమాలయాలకు వెళితే అవి మంచు కొండలని కేవలం ఈ ప్రకృతిలో ఒక భాగమేనని తెలుసుకుంటే మంచిది. తనకు పట్టిన మనువాద చంద్రముఖిని తరిమి తరిమి కొట్టి, హిమాలయాలు దాటించితే మరీ మంచిది.

నాకైతే సినిమా చూస్తున్నంత సేపు ఆర్యులు చేసిన సింధునాగరికత విధ్వంసం , రామాయణం , రావణుడు ఇలా అన్నీ ఏకకాలంలో కనిపించాయి.
అది తమిళనాడు కాదు ద్రవిడనాడు.
– రవిచంద్ర పొన్నం