ఎన్టీఆర్, రాజ్ కపూర్, చిరంజీవి, కమల్ హాసన్ అపురూప “స్వాతిముత్యం ” ముప్పై మూడు సంవత్సరాల నాటి అపురూప జ్ఞాపకం. దర్శకులు కె. విశ్వనాధ్, నిర్మాత ఏడిద నాగేశ్వర గారు కలసి రూపొందించిన “సిరిసిరి మువ్వ”, “శంకరాభరణం “, ” సాగర సంగమం” చిత్రాలు అమోఘమైన విజయాన్ని సాధించాయి. పూర్ణోదయా సంస్థ కు ఎనలేని కీర్తిని సంపాదించిపెట్టాయి. విశ్వనాధ్ సృజనాత్మక దర్శకుడు. ఏడిద నాగేశ్వర రావు అభిరుచి వున్న నిర్మాత. అందుకే వీరు చిరస్మరణీయమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.
1986 వ సంవత్సరంలో వీరు కలసి కమలహాసన్, రాధికతో నిర్మించిన విభిన్నమైన సినిమా “స్వాతి ముత్యం “. అమాయకుడు, వెర్రి బాగులవాడు, ఓ వితంతువుతో కూడా సినిమా తీసి అఖండమైన విజయం సాధించవచ్చని కళాతపస్వి విశ్వనాథ గారు నిరూపించారు. ఈ సినిమా మర్చి 13, 1986 లో విడుదలై ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఇందులో శివయ్య గా కమలహాసన్ అద్భుతంగా నటించాడు. లలితగా రాధిక వైవిధ్యమైన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విశ్వనాథ్ గారి దర్శకత్వం, ఇళయరాజాగారి సంగీతం ఈ చిత్రాన్ని జనరంజకంగా రూపొందించాయి. మానవ సంబంధాలకు, విలువలకు “స్వాతి ముత్యం” ప్రతీకగా రూపొందింది. సెంటిమెంట్, సంగీతం ఒకదానితో మరోటి పోటీ పడ్డాయని చెప్పవచ్చు.
ఘన విజయం సాధించిన ఈ సినిమా 100 రోజుల వేడుకను జూన్ 20న హైద్రాబాద్ లలిత కళాతోరణం లో జరపడానికి నిర్మాత నాగేశ్వర రావు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యంమత్రి ఎన్.టి.రామారావు గారు, హిందీ చిత్ర రంగ షో మన్ రాజ్ పూర్ గారు, చిరంజీవి గారు అతిధులుగా హాజరవుతన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్మాత, దర్శకుడు భారీగా జరపడానికి నిశ్చయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే లలిత కళాతోరణాన్ని గ్రాండ్ గా అలంకరించారు.
ఆ రోజు ఉదయం మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు విశ్వనాథ్, నాగేశ్వర రావు, రాధికను ఆహ్వానించాము. నాగేశ్వర రావు గారు అంత తీరికలేని పనుల్లో వున్నా తప్పకుండా వస్తామని చెప్పారు. జర్నలిస్టులంటే వారికి ఎంతో గౌరవం, అభిమానము. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడుగా జి.ఎస్.వరదాచారి గారు కార్యదర్శిగా నేను వున్నాము. నేను అప్పుడు జ్యోతి చిత్ర సినిమా పత్రిక రిపోర్టర్ గా ఉండేవాడిని. విశ్వనాధ్ గారు, ఏడిద నాగేశ్వర రావు గారితో నాకు బాగా పరిచయం, అందుకని మేము ఆహ్వానించగానే వస్తామని హామీ ఇచ్చారు.
విశ్వనాథ్ గారు, రాధిక గారు, ఏడిద నాగేశ్వర రావు గారు ముగ్గురు చెప్పిన సమయానికి బషీర్ బాగ్ లో వున్న ప్రెస్ క్లబ్ కు వచ్చారు. ఫిలిం క్రిటిక్స్ సభ్యులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. సమావేశం చాలా ఆసక్తిగా జరిగింది. ఆ తరువాత మొదటి అంతస్తులో వున్న ఫిలిం క్రిటిక్స్ కార్యాలయం లోకి వచ్చి కాసేపు కూర్చున్నారు. అయితే ఆరోజు మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వర్షము కురవడం జరిగింది. ఈ కారణంగా “స్వాతి ముత్యం” శతదినోత్సవ కార్యక్రమాన్ని చార్మినార్ క్రాస్ రోడ్స్ లోని దేవి థియేటర్ కు మార్చారు. ఒక తెలుగు సినిమా శత దినోత్సవం ఎంత అద్భుతంగా, కన్నులపండుగగా జరుగుతుందో “స్వాతి ముత్యం” చూస్తే తెలిసింది. ముఖ్యమంత్రి ఎన్.టి.రామా రావు, షో మన్ రాజ్ కపూర్, చిరంజీవి, చిరంజీవి ప్రత్యేక “స్వాతిముత్యం” సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
-భగీరథ