స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా పనితీరులో మాత్రం మార్పేమిలేదు సరికదా, ఒకరిని మించినవారు ఇంకొకరు. దానిని బలపరుస్తున్న మరో ప్రత్యక్ష ఉదాహరణ .. దశాబ్దాలపాటు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఉపయోగించి కట్టిన ఓ కాలువ గంటల వ్యవధిలోనే కూలిపోయిన ఘటన జార్ఖండ్‌లోని హజరీబాగ్‌లో చోటుచేసుకుంది. కోణార్ రివర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఓ నీటి కాలువను దాదాపు 42 ఏళ్లపాటు అక్కడి ప్రభుత్వం నిర్మించింది.
కాలువ నిర్మాణ పనులు దశాబ్దాలపాటు నత్తనడకన సాగడం వల్ల నిర్మాణ వ్యయం ఏకంగా రూ.12 కోట్ల నుంచి రూ.2,176 కోట్లకు చేరింది. కాలువ నిర్మాణ పనులు పూర్తికావడంతో జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ దానిని బుధవారం రోజు ప్రారంభించారు. ప్రారంభించిన 24 గంటల్లోనే కాలువ కూలిపోయింది. దీంతో స్పందించిన ప్రభుత్వం.. విచారణకు ఆదేశించింది. కాలువ కూలిపోవడానికి సంబంధించిన అంశాలను పరిశీలించిన అధికారుల బృందం.. ఎలుకలు చేసిన రంధ్రాల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని నివేదికలో పేర్కొంది. కాగా.. దీనిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.