అభ్యర్థుల జాతకాలు మారిపోవడానికి ఒక్క ఓటు చాలు! అందుకే ప్రతి ఓటును ఎంతో విలువైనదిగా భావిస్తుంటారు. అయితే, విజయవాడ సెంట్రల్ స్థానంలో మొదటి రౌండ్ నుంచి హోరాహోరీ నెలకొనగా, చివరికి వైసీపీ అభ్యర్థినే విజయం వరించింది. ఎంతో కీలకమైన విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమ, వైసీపీ నుంచి మల్లాది విష్ణు పోటీచేశారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా చివరి రౌండ్ వరకు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఆఖరికి మల్లాది విష్ణుదే పైచేయి అయింది. అది కూడా కేవలం 15 ఓట్లతో మాత్రమే! దాంతో తన గెలుపు పట్ల మల్లాది విష్ణు ఆనందోత్సాహాల్లో మునిగితేలగా, బొండా ఉమ మాత్రం ఉసూరుమన్నారు!