telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

తెలంగాణలో దరఖాస్తు చేస్తే..ఏపీలో ఎంసెట్ పరీక్షా కేంద్రం!

తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల నిర్వహనలో అధికారుల అలసత్వం మరోసారి బయటపడింది. ఇంటర్ ఫలితాల గందరగోళం మర్చిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9న జరగనున్న ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసిన ఓ విద్యార్థినికి జేఎన్టీయూ షాక్ ఇచ్చింది. అమ్మాయి మహబూబ్ నగర్ జిల్లాలో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా, ఏకంగా కర్నూలులోని నందికొట్కూరులో సెంటర్ ను కేటాయించింది. దీంతో హాల్ టికెట్ చూసుకున్న యువతి బిత్తరపోయింది. సొంత రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షకు అప్లై చేసుకుంటే, పక్క రాష్ట్రంలోకి వెళ్లి రాయడం ఏంటని అధ్యాపకులు కూడా విస్తుపోయారు. చివరికి ఈ విషయాన్ని ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్న జేఎన్టీయూ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నెల 9న జరిగే ఎంసెట్ పరీక్షలకు(అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం) యువతి దరఖాస్తు చేసుకుందని జేఎన్టీయూ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కర్నూలును తాము మహబూబ్ నగర్ జోన్ లో చేర్చామని వెల్లడించారు. పరీక్షా కేంద్రం మహబూబ్ నగర్ కు 70 కిలోమీటర్ల దూరంలోనే ఉందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు విద్యార్థిని పరీక్షా కేంద్రాన్ని మార్చడం కష్టమని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ లో పరిమితి కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఎంసెట్ కు దరఖాస్తు చేసుకోవడంతో సమీపంలోని నందికొట్కూరులో మరో సెంటర్ కేటాయించామని వివరణ ఇచ్చారు.

Related posts