జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నిధుల కొరతతో అల్లాడుతున్నా, రూ.400 కోట్ల మేర అత్యవసర నిధులు అందించేందుకు బ్యాంకులు నిరాకరించడమే, జెట్ ఎయిర్‌వేస్ ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణమైంది. అమృత్‌సర్ నుంచి దిల్లీకి నడుపుతున్న విమానమే ఆఖరిదని సంస్థ ప్రకటించింది.
అన్ని అంతర్జాతీయ, దేశీయ విమానాలను నిలిపి వేస్తున్నామని, పాతికేళ్ల ప్రస్థానం కలిగిన జెట్ ఎయిర్‌వేస్ స్టాక్‌ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ‘బ్యాంకులతో పాటు ఇతర ఏ మార్గం నుంచి కూడా అత్యవసరంగా నిధులందే పరిస్థితి లేదు. ఇందువల్ల కార్యకలాపాలకు అవసరమైన ఇంధనం, ఇతర కీలక విభాగాలకు చెల్లింపులు జరపలేకపోతున్నాం. ప్రత్యామ్నాయాలు అన్నీ పరిశీలించి, నిలదొక్కుకునే మార్గం లేకనే, బాధాకరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింద’ని జెట్ ప్రకటించింది.
సంస్థ షెడ్యూల్ ప్రకారం, బుధవారం రాత్రి 10.30 గంటలకు అమృత్‌సర్‌లో బయలుదేరి దిల్లీ వెళ్లే విమానమే చివరిదని సమాచారం. సంస్థ తాత్కాలిక మూసివేత వల్ల 16,000 మంది సిబ్బంది భవితవ్యం ప్రమాదంలో పడింది.
కింగ్‌ఫిషర్ తరవాత గత దశాబ్ద కాలంలో దేశీయంగా మూతబడిన (తాత్కాలికంగా అయినా) పెద్ద విమానయాన సంస్థల్లో జెట్ ఎయిర్‌వేస్ రెండోది.
* జెట్‌లో 75 శాతం వరకు వాటా విక్రయించేందుకు ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకులు బిడ్లను ఆహ్వానించాయి. జెట్ మూతబడకుండా ఎస్‌బీఐ ప్రయత్నించింది. అయితే లీజుదార్లకు నిధులు చెల్లించకుండా, ఇంధన – సిబ్బందికి వేతన బకాయిలు తీర్చకపోతే, ఏ పెట్టుబడిదారు అయినా ఎందుకు ముందుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు. విమానాలు, పైలట్లు, క్రూసిబ్బంది, ఇంజినీర్లు లేకుండా జెట్‌లో ఏం విలువను చూస్తారనే ప్రశ్నా ఉదయిస్తోంది. దేశంలో మూతబడిన విమానయాన సంస్థ ఏదీ మళ్లీ పునరుద్ధరణకు నోచుకోలేదు.