తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. . అమెరికాలో జరుగుతున్న తానా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థ చేసిన తప్పిదాలు వల్ల ప్రజలందరూ బాధపడాల్సిన రోజు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారన్నారు. విలువలతో పోరాడి ఓడిపోవడం వల్ల గర్వంగానే ఉందని చెప్పారు.
డబ్బులు తీసుకుని ఓటు వేయడం వల్ల మన నైతిక బలం పోతుందని అభిప్రాయపడ్డారు. నాయకులకు ప్రజలంటే గౌరవం ఉండదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సమాజం రాకూడదని విజ్ఞప్తి చేశారు. మన దేశం అమెరికా తరహాలో ఎందుకు అభివృద్ధి కాలేదని ఆలోచించేవాడినన్నారు. అందుకు కారణం మన సంస్కృతి కులాలతో ముడిపడి ఉందని అర్థమైందన్నారు. మనలో ఆ భావన పోనంత వరకూ అమెరికాలాంటి దేశాలతో పోటీ పడటం చాలా కష్టమని తేల్చిచెప్పారు.