టీడీపీ అధికార ప్రతినిధి యామినిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. తన గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బాగుండదని యామినిపై పవన్ మండిపడ్డారు. పల్నాడులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తాను చాలా గౌరవంగా మాట్లాడతానని ఏమైనా తప్పులుంటే ఖండించాలని సూచించారు. అంతే తప్ప తన వ్యక్తిగత జీవితంపై ఇష్టానుసారంగా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు.
అసలు తన వ్యక్తిగత జీవితం గురించి వారికేం తెలుసని ప్రశ్నించారు. తనను విమర్శించేంత విలువలు మీకు ఉన్నాయా అని దుయ్యబట్టారు. నాడు మీ జెండాలు మోసిన వారిపై కేసులు పెట్టి చచ్చిపోయేలా కొడతారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనపై విమర్శలు చేసిన వారిపై తమ కార్యకర్తలు ఒక్క మాట అంటేనే కేసులు పెట్టించి కొడుతున్నారనివిమర్శించారు. తమ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని లేదంటే యుద్ధం తప్పదని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. మీరు హద్దులు దాటితే మేం కూడా దాటాల్సి వస్తుందని హెచ్చరించారు. తాను ఏం మాట్లాడినా అందులో వాస్తవం ఉంటుందని పవన్ పేర్కొన్నారు.