టీడీపీ, వైసీపీ లో వారసత్వ అధికారం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. వారసత్వంగానే ఆ పార్టీ నేతలు ఇంత వారయ్యారని చెప్పారు. కానీ జనసేన ఏ వారసత్వమూ లేకుండా జనంలోంచి పుట్టుకొచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు. విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంలో పవన్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీతో గానీ, వైసీపీతో గానీ వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం తనకు లేదని స్పష్టం చేశారు.
తనను నటుడు అంటూ విమర్శిస్తున్న వైసీపీ అధినేత జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సినీనటులను ఎందుకు తన పార్టీలో చేర్పించుకుంటున్నారని ప్రశ్నించారు. రెండేళ్లపాటు జైల్లో ఉన్న జగన్ అవినీతి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి నుంచి ఓ మంచి విషయం నేర్చుకున్నానని అని అన్నారు. విశాఖలో సామాన్యుల భూములు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. అధికారంలోకి వచ్చాక వారి భూములు కబ్జా చేసిన అక్రమార్కులను జైల్లో పెట్టించే బాధ్యత తనదేనని పవన్ హామీ ఇచ్చారు.