అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వరుసగా రెండోసారి గెలుపు మాదేనని వైసీపీ ధీమాగా ఉండగా.. 2024లో విజయంపై టీడీపీ ధీమాగా ఉంది.
మరోవైపు జనసేన -బీజేపీ కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న విశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ సర్వసభ్య సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన స్టేట్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
పొత్తుల అంశంలో పవన్ మూడు ఆప్షన్లు ఉన్నాయని , అందులో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం ..రెండో ఆప్షన్ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం..మూడో ఆప్షన్‌గా జనసేన ఒంటరిగా పోటీ చేయడమని పవన్ వ్యాఖ్యానించారు.
పొత్తులపై తాను తగ్గబోనని 2014, 2019 ఎన్నికల్లో తగ్గానని, ఈసారి మిగతావాళ్ళు తగ్గితే మంచిదని పరోక్షంగా టీడీపీకి సంకేతాలు పంపారు.
పొత్తులపై ఇచ్చిన మూడు ఆప్షన్‌లను పరిగణలోకి తీసుకుంటే ఇందులో టీడీపీతోపాటు బీజేపీని కూడా పవన్ టార్గెట్ చేసుకున్నారని స్పష్టమవుతోంది.
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ పర్యటన నేపథ్యంలో రెండు పార్టీల పొత్తుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇదే సమయంలో పవన్.. ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ పై జనసేన నేతలు వాయిస్ పెంచుకున్నారు.
ఏపీలో సీఎం అభ్యర్థి స్థాయి నేతలు బీజేపీలో లేరని.. అందుకే పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే రెండు పార్టీలు ఉత్సాహంగా వ్యూహాలను అమలు చేసే అవకాశముందని జనసేన చెప్తోంది.
జనసేన చేస్తున్న డిమాండ్ పై బీజేపీ మాత్రం అంత ఈజీగా అంగీకరించేలా కనిపించడం లేదు. ఒకరు ఒత్తిడి తీసుకొచ్చినంత మాత్రాన సీఎం అభ్యర్థిగా ప్రకటించలేమంటున్నారు. ఎవరు మెట్టు దిగుతారో, ఎవరు పైకి వెళతారో త్వరలోనే తెలుస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టాలనే తీవ్రమైన సంకల్పం జాతీయ నాయకత్వంలో నెలకొందని.. బీజేపీ, జనసేన కలిసి 2014 ఎన్నికల్లో పోటీ చేస్తాయని, అధికారంలోకి రావాలన్నదే తమ ఆలోచన అని, ఆ ప్రకారమే కార్యాచరణ సిద్ధం చేసి ముందుకు వెళతామని చెప్పారు.
నడ్డా వచ్చింది పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడానికే తప్ప పొత్తులు, సీఎం అభ్యర్థులను ప్రకటించడానికి కాదని. సీఎం అభ్యర్థి ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు.
జీవీఎల్ కామెంట్స్‌పై జనసేన లీడర్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఎవరో వస్తారు గెలుస్తామన్న ఆశతో తాము పొత్తులకు ప్రయత్నించడం లేదంటున్నారు పసుపులేటి హరిప్రసాద్. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. తమతో ఎవరు కలిసి వచ్చినా రాకున్నా 2024లో విజయం సాధించేది జనసేన పార్టీ అంటున్నారు ఆ పార్టీ నేతలు.
పవన్ స్టేట్‌మెంట్‌పై టీడీపీ ఇంత వరకు ఎలాంటి అధికారిక స్టేట్‌మెంట్ ఇవ్వలేదు.అయితే నడ్డా పర్యటనలో భాగంగా బీజేపీ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందనేది రాష్ర్ట రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.