జనసేన నుండి నేతలు ఎందుకు వెళ్లిపోతున్నారో ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వెల్లడించారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలంతా తాము పార్టీని వీడటానికి మనోహరే కారణమని చెబుతున్నారని ఆయన అన్నారు. పార్టీకి సంబంధించిన అన్ని అంశాలపై తమ అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు మాత్రమే సంప్రదించుకుంటారని తెలిపారు. వ్యక్తిగతంగా నాదెండ్లతో తనకు ఇబ్బంది లేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల కారణంగానే పవన్ దీక్షకు తాను హాజరుకాలేదని తెలిపారు. ప్రభుత్వం మంచి కార్యక్రమాలను చేపడితే తాను ప్రశంసిస్తానని చెప్పారు.
తనకు పార్టీ మారాలి అనే ఉద్దేశ్యం లేదని రాపాక తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారడం అన్నది సర్వసాధారణమేనని చెప్పారు. గతంలో నేతలకు రాజకీయ విలువలు ఉండేవని, పార్టీ మారే నేతలను ప్రజలు కూడా వ్యతిరేకించేవారని. ఇప్పుడు నేతలకు నిజాయతీ లేదని. నేతలు పార్టీలు మారినా ప్రజలు కూడా పట్టించుకోవడం లేదని అన్నారు.