telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విధానాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతగా దూషిస్తారా… సహనాన్ని పరీక్షించకండి -వైసీపీ ప్ర‌భుత్వానికి పవన్ వార్నింగ్‌

*ఏపీలో విద్యుత్ కోత‌ల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఘాటు లేఖ‌
*విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కార‌ణం
*మొబైల్ ఫోన్ వెలుతురులో ప్ర‌స‌వాలు..రాష్ర్టంలో దుస్థితిని తెలియ‌చేస్తున్నాయి..
*ప‌ల్లెల్లో 14గంట‌లు ,ప‌ట్ట‌ణాల్లో 8 గంట‌ల‌కు త‌గ్గ‌కుండా విద్యుత్ కోత‌లు
*ప‌వ‌ర్ హాలీడే ప్ర‌క‌ట‌న‌తో పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం..

ప్రభుత్వ విధానాలు, పాలసీల గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా రాక్షసుడు, దుర్మార్గుడు అని దూషిస్తున్నారా అంటూ జ‌న‌సేన అధినేత‌, న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫైర్ అయ్యారు. వ్యక్తిగతంగా దూషణలకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు.. మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడి సహనాన్ని పరీక్షించ వద్దని హెచ్చరించారు.

వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదన్న పవన్… ప్రజలు బాగుండాలి, వారిని పల్లకీ ఎక్కించాలనే ఉద్దేశంతోనే పార్టీని ప్రారంభించానన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుంచి పెరిగిన విద్యుత్ ఛార్జీల వరకు ప్రజల పక్షానే పోరాటం చేస్తున్నామన్నారు. ఉద్యోగులు రోడ్డెక్కడానికి, కౌలు రైతుల ఆత్మహత్యలకు కారణం మేము కాదు..మీ విధానాలే అని పవన్ అన్నారు .

రాష్ర్టంలో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ ప్ర‌భుత్వ అనాలోచిత విధానాలే కార‌ణ‌మ‌ని ..జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరును ఎత్తిచూపారు .ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌వ‌న్ కల్యాణ్ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాలు, అనాలోచిత విధానాలే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభానికి కారణమని పవన్ కల్యాణ్ఆరోపించారు.

ప‌ల్లెల్లో 14 గంట‌లు, ప‌ట్ట‌ణాల్లో 8 గంట‌ల‌కు త‌గ్గ‌కుండా విద్యుత్ కోత‌లు అమ‌లు చేస్తున్న వైసీపీ స‌ర్కారు… అన‌ధికారికంగా కోత‌ల‌ను మ‌రింత మేర పెంచి అమ‌లు చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌వ‌న్ ఆ ప్ర‌క‌ట‌న‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యుత్ కోత‌ల నేప‌థ్యంలో ఆసుప‌త్రుల్లో మొబైల్ ఫోన్ వెలుగులో ప్ర‌స‌వాలు జ‌రుగుతున్నాయంటే ప‌రిస్థితి ఏ మాదిరిగా ఉందో అర్థ‌మ‌వుతోంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
ఉచితం అని చెప్పి ఛార్జీలు పెంచారు.

ఉచితం అని చెప్పి ఛార్జీలు పెంచారు

అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని… అల్పాదాయ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పిన వైసీపీ 57 శాతం ఛార్జీలు పెంచింది అన్నారు పవన్. ఫ్యాను, రెండు లైట్లు, 15 గంటలు టీవీ చూసినా 150 యూనిట్లే ఖర్చు అవుతుందని… మరో 50 యూనిట్లు పెద్ద మనసుతో అదనంగా ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేశారని విమర్శించారు.

విద్యార్థులకెన్నో ఇక్కట్లు

విద్యార్థులు, పరీక్షలకు సన్నద్దమవుతున్న టైంలో విద్యుత్‌ కోతలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు పవన్ కల్యాణ్. పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర లేక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఇళ్లల్లో కరెంటు లేకపోవడంతో కొందరు రైల్వే స్టేషన్, బస్టాండుల్లో పడుకుంటున్నారని వివరించారు.

ప‌వ‌ర్ హాలీడే ప్ర‌క‌ట‌న‌తో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతోంద‌న్నారు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు విద్యుత్ కోతలతో నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతుందని.. ఈ ఫ‌లితంగా 36 ల‌క్ష‌ల మంది కార్మికుల‌కు ఉపాధి దూర‌మ‌వుతోంద‌ని ప‌వ‌న్ అన్నారు.

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు నుంచి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించే వరకు వైసీపీ అనాలోచిత విధానాల ఎలా మోసం చేస్తోందో ప్ర‌తి ఒక‌ జనసైనికుడు, వీర‌మ‌హిళా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప‌వ‌న్ అన్నారు

.

Related posts