telugu navyamedia
రాజకీయ

కశ్మీర్​ వేర్పాటువాద నేత యాసిన్​మాలిక్​కు జీవితఖైదు

*జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు జీవిత ఖైదు
*జీవిత‌ఖైదు విదించిన ప‌టియాల ఎన్‌ఐఏ కోర్టు..

జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌మాలిక్‌కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది.జీవిత ఖైదుతోపాటు రూ. 10లక్షల జరిమానా విధించింది. పదేళ్లు కఠిన కారాగార శిక్ష, మరో ఐదేళ్లు ఉపా చట్టం కింద శిక్ష అమలు చేయాలని తీర్పునిచ్చింది.

అంతకుముందు యాసిన్ మాలిక్ కు మరణ శిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డిమాండ్‌ చేసింది.

కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదం, ఉగ్రకార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసుల్లో సంబంధించి 2017లో మాలిక్‌పై ఎన్‌ఐఏ కోర్టు కేసు నమోదు చేసింది. భద్రతాబలగాలపైకి రాళ్లు రువ్వడం, స్కూల్స్‌ తగలపెట్టడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, దేశ విద్రోహ చర్యలకు పాల్పడడం వంటి వాటి కోసం ఉగ్రనిధులను వినియోగించినట్టు ఎన్‌ఐఏ అభియోగ పత్రం​ దాఖలు చేసింది. 1989లో జరిగిన కశ్మీర్‌ పండిట్ల మారణహోమంలోనూ జేకేఎల్‌ఎఫ్‌ పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసుల్లో యాసిన్‌ మాలిక్‌ను దోషిగా ఢిల్లీ కోర్టు మే 19న దోషిగా నిర్ధరించింది. (మే 25న) నేడు యాసిన్‌మాలిక్‌కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.

టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో తనపై నమోదైన అన్ని అభియోగాలను యాసిన్‌మాలిక్‌ అంగీకరించాడు. యాసిన్ మాలిక్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలని అతని ఆస్తులకు సంబంధించి అఫిడవిట్ ఇవ్వాలని కోర్టు ఎన్‌ఐఎని ఆదేశించింది.

మాలిక్‌తో పాటు పలువురు కశ్మీరీ వేర్పాటువాద నేతలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌లపై కూడా ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ, కశ్మీర్‌లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారుముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Related posts