కశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేసిన పలు ప్రాంతాల్లో నేటి నుంచి హైస్కూళ్లు తెరచుకోనున్నాయి. ఇప్పటికే ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. టీచర్ల హాజరుశాతం పెరుగుతోందని సమాచార, ప్రజా సంబంధాల డైరెక్టర్ సెహ్రిశ్ చెప్పారు. ఆంక్షలు లేని ప్రాంతాల్లో దుకాణాలు తెరచుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. త్వరలోనే కశ్మీర్ లోయలో రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తామని తెలిపారు.
మరోవైపు కశ్మీర్ విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే విషయాలపై చర్చించేందుకు కేంద్ర ఉన్నతాధికారులు ఢిల్లీలో భేటీ అయ్యారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఏకే భల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో 15 మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కేంద్ర పథకాల అమలు విషయాలు చర్చలో ప్రస్తావించారు.