telugu navyamedia
తెలంగాణ వార్తలు

నువ్వు పోరగానివి.. పార్టీలో బచ్చాగాడివి..ఎవర్ని బండకేసి కొడతావ్‌..

కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యస్వంత్ సిన్హాకు స్వాగతం పలికి మద్దతు ప్రకటించే విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కరవైంది.

కేసీఆర్‌ను కలిసేందుకు వస్తున్న యస్వంత్ సిన్హాను కలిస్తే తప్పుడు సంకేతాలు వస్తాయని.. ఎట్టిపరిస్థితుల్లో కలవకూడదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.కేసీఆర్​ను కలిసిన నేతను కలవబోయేదిలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి పదేపదే చెబుతూవచ్చారు. కేసీఆర్​ను మొదట కలిస్తే.. యశ్వంత్ సిన్హానే కాదు.. బ్రహ్మ దేవుడినైనా కలిసేది లేదని తెగేసి చెప్పారు.

అయితే అధిష్ఠానం నిర్ణయానికి భిన్నంగా పార్టీ సీనియర్ నేత వీహెచ్ శ‌నివారం బేగంపేటలో సీఎం కేసీఆర్‌తో కలిసి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. వీహెచ్ కలవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అవుతూ.. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించకపోతే బండకేసి కొడతా అన్నట్టు వార్నింగ్ ఇచ్చాడు.

ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. రేవంత్​రెడ్డిపై ఉన్న అక్కసునంతా మరోసారి బయటపెట్టారు. రేవంత్‌ వచ్చిన తర్వాత పార్టీకి ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు. వీహెచ్ లాంటి సీనియర్ నాయకుడిని బండకేసి కొడతావా.. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి.

ఓపిక లేని వ్యక్తి పీసీసీ చీఫ్​గా ఉండడానికి ఆర్హుడు కాదు. నాలుగు నెలలుగా పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడకుండా ఉన్నా. ఇప్పుడు రేవంత్‌ రెడ్డినే నన్ను రెచ్చగొట్టాడు. రేవంత్‌ రెడ్డిని పీసీసీ పదవి నుంచి తొలగించాలని అధిష్ఠానానికి లేఖ రాస్తానన్నారు. నూటికి నూరు శాతం రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి లేకపోయినా పార్టీని నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. వీ

వీహెచ్ ఎవరో తెలియదని రేవంత్ అనడం సరికాదు. బండకేసి కొడతా అనడానికి రేవంత్‌రెడ్డి ఎవరు?. బండకేసి కొట్టడానికి మేమేమైనా నీ పాలేరులమా?

నువ్వు పోరగానివి.. పార్టీలో బచ్చాగాడివి..ఎవర్ని బండకేసి కొడతావంటూ ఆయన ప్రశ్నించారు. పీసీసీ పోస్ట్ దిగి చూస్తే.. నీకేం విలువ వుంటుందని జగ్గారెడ్డి నిలదీశారు.

అందరం కలిసి పని చేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందన్న విషయాన్ని మరచిపోరాదు.చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts