telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పులివెందుల బిడ్డగా ప్రజల రుణం తీర్చుకుంటా: జగన్

ys jagan cm

పులివెందుల బిడ్డగా ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కడప జిల్లాలో మూడో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో పలు అభివృద్ధి పథకాలకు జగన్ శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయిన పలు భవనాలను ప్రారంభించారు. రూ. 347 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న వైఎస్సార్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు జగన్ శంకుస్థాపన చేశారు.అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పులివెందులకు జగన్ వరాల జల్లు కురిపించారు. పులివెందుల మునిసిపాలిటీ పరిధిలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ కోసం రూ. 100 కోట్ల నిధులను ప్రకటించారు.

ఇంటింటికీ నీరందించే సమీకృత పథకానికి తక్షణం రూ. 65 కోట్లను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. వేంపల్లిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు రూ. 63 కోట్లను ప్రకటించారు. జేఎన్‌టీయూలో లెక్చరర్‌ కాంప్లెక్స్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ల కోసం రూ. 20 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. పులివెందులలో మోడల్ పోలీస్ స్టేషన్ ను నిర్మిస్తామని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక సంస్థల కాలేజీల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గండికోట రిజర్వాయర్ దిగువన 20 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యంతో డ్యామ్ నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో 7 గిడ్డంగులను ఏర్పాటు చేస్తామని, మార్కెట్ యార్డ్ ను ఆధునికీకరించే పనులు తక్షణం మొదలు పెడతామని తెలిపారు. ఉద్యానవన పంటల కోసం కోల్డ్ స్టోరేజీని నిర్మిస్తామని అన్నారు. వేంపల్లి ఆసుపత్రిలో ప్రస్తుతమున్న 30 పడకలను 50 పడకలకు పెంచేందుకు నిధులను మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Related posts