telugu navyamedia
క్రీడలు వార్తలు

ధోని సలహాతోనే అది సాధ్యం అయ్యింది : జడేజా

నిన్న జరిగిన మ్యాచ్ లో బెంగళూరు పేసర్ హర్షల్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ‘సర్’ జడేజా 5 సిక్సర్లు, ఒక ఫోర్‌, రెండు పరుగులు సాధించి మొత్తం (ఒక నోబాల్) 37 పరుగులు పిండుకున్నాడు. జ‌డేజా కేవ‌లం 28 బంతుల్లో 62 ప‌రుగులు చేశాడు. అయితే నిజానికి రవీంద్ర జడేజా డకౌట్‌గా వెనుదిరగాలి. మైదానంలోకి రాగానే స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌‌లో భారీ షాట్ ఆడిన జడేజా.. బౌండరీ లైన్ వద్ద క్రిస్టియాన్ చేతికి చిక్కాడు. కానీ అతను క్యాచ్‌ని నేలపాలు చేశాడు. అలా లైఫ్ లభించిన తర్వాత రెచ్చిపోయిన జడేజా పరుగులు బాదేశాడు. అయితే హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఐదు సిక్సర్లు కొట్టడానికి ఎంఎస్ ధోనీ ఇచ్చిన సలహానే కారణం అని రవీంద్ర జడేజానే స్వయంగా వెల్లడించాడు. ‘చివరి ఓవర్‌లో హిట్టింగ్ చేయాలని నేను ముందే నిర్ణయించుకున్నా. అయితే ఆ ఓవర్‌కి ముందు మహీ భాయ్ ఓ చిన్న సలహా ఇచ్చాడు. హర్షల్ పటేల్ బంతుల్ని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వేయబోతున్నట్లు అంచనా వేసి నన్ను అలెర్ట్ చేశాడు. దాంతో నేను ముందుగానే ఆ బాల్స్‌ని ఆడేందుకు సిద్ధమైపోయా. లక్కీగా నేను అన్ని బంతుల్నీ భారీ షాట్లు ఆడగలిగా. దాంతో చెన్నై 191 పరుగుల మార్క్‌ని చేరుకోగలిగింది. జట్టు పరంగా అవి మాకు చాలా కీలకమైన పరుగులు’ అని జడేజా వెల్లడించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒకే ఓవ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు న‌మోదు చేసిన రికార్డును ర‌వీంద్ర జ‌డేజా అందుకున్నాడు.

Related posts