ఏపీలో మరోసారి ఐటీ దాడులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని అమలాపురంలో పలువురు వ్యాపారుల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. ఐటీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో పలు బృందాలుగా విడిపోయిన అధికారులు సుమారు ఆరు చోట్ల సోదాలు చేశారు.
పట్టణంలోని వడ్డీవ్యాపారి నిమ్మకాయల సత్యనారాయణ ఇంటితోపాటు రొయ్యల మేత దుకాణాల్లో సోదాలు చేపట్టారు. అల్లవరం మండలం కోడూరుపాడులో ఉన్న రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రంలోనూ తనిఖీలు చేశారు. ఇదే పట్టణానికి చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి ఆదిబాబు, ఉప్పలగుప్త మండలం గోపవరం గ్రామంలోని ఆకుల చంటి ఇళ్లలోనూ ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.
గత నెలలో పలువురు రియల్‌ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లో జరిగిన సోదాలకు ఇవి కొనసాగింపుగా జరుగుతున్నాయని సమాచారం. ఐటీ దాడుల నేపథ్యంలో పట్టణంలోని ఆక్వా రైతులతోపాటు వడ్డీ వ్యాపారులు హడలిపోతున్నారు.