మెఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు చేసింది. దేశవ్యాప్తంగా మెఘా అధినేతకు చెందిన కార్యాలయాలు, సంబంధీకుల నివాసాలపై మొత్తం 17 చోట్ల ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి కృష్ణారెడ్డి ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మెగా కృష్ణారెడ్డి సంస్థల అకౌంట్ బుక్‌లలో ట్యాక్స్‌కు సంబంధించి అవకతవకలు జరిగాయనే కారణంతో ఐటీ దాడులు జరుగుతున్నాయని సమాచారం. కాగా ఐటీ శాఖ తమ కార్యాయాల్లో జరిగింది ఐటీ దాడులు కాదని.. ఇవి సాధారణంగా జరిపే తనిఖీలేనని మెఘా సంస్థ తెలిపింది. ఇవి సాధారణ తనిఖీలనే విషయం గుర్తించాలని మీడియా సంస్థలను కోరింది. గతంలో మైహోం సంస్థపై కూడా ఐటీ దాడులు జరిగాయని వార్తలొచ్చాయి. కానీ అదంతా తప్పుడు ప్రచారమని ఆ సంస్థ స్పష్టం చేసింది. మెఘా సంస్థ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకుంది. ఇటీవలే రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం కాంట్రాక్టును సైతంను ఈ సంస్థ దక్కించుకుంది. అలంద మీడియా.. టీవీ9 సంస్థలో మెజార్టీ వాటాలు కొనుగోలు చేసిన నాటి నుంచి మై హోం రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి పేర్లు వార్తల్లో వస్తున్నాయి. టీవీ9 నుంచి బయటకు వెళ్లిన రవి ప్రకాశ్, కొత్త యాజమాన్యం మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. రవిప్రకాశ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. రవి ప్రకాశ్‌పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. మెఘా కృష్ణారెడ్డిపై నటుడు శివాజీ ఇటీవలే సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ఆయన భారీగా దోపిడీకి పాల్పడ్డారని, ఓఎన్జీసీ కాంట్రాక్టులను అక్రమ మార్గాల్లో దక్కించుకున్నారని శివాజీ ఆరోపించారు. ఇలాంటి తరుణంలో మెఘా కృష్ణారెడ్డి ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతుండటం గమనార్హం.
previous post