భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ45 రాకెట్ ను ప్రయోగించనుంది. ఇందుకోసం షార్‌లోని రెండో ప్రయోగ వేదిక సిద్దమైంది. సోమవారం ఉదయం 9.27 గంటలకు దీనిని ప్రయోగించనున్నారు. ఇందుకోసం ప్రయోగ సన్నాహాల్లో భాగంగా ఆదివారం ఉదయం 6:27కి 27 గంటల కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ఈ ప్రయోగానికి ఇస్రో పీఎస్ఎల్వీ-క్యూఎల్‌గా నామకరణం చేసింది.
ఈ రాకెట్ ద్వారా డీఆర్‌డీవో రూపొందించిన 436 కిలోల ఈఎంఐ శాట్‌ను రోదసిలో 749 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 98 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టనున్నారు. ఇది దేశ రక్షణ రంగానికి ఉపయోగపడనుంది. అలాగే అమెరికాకు చెందిన 20 భూపరిశీలన నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన రెండు, స్విట్జర్లాండ్, స్పెయిన్‌కు చెందిన ఉపగ్రహాలను రోదసీలో 504 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టనుంది.