telugu navyamedia
క్రీడలు వార్తలు

బంతి స్వింగ్‌ పై ఇషాంత్ కీలక వ్యాఖ్యలు…

టీమిండియా సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఉమ్మి రుద్దకున్నా ఇంగ్లండ్‌లో బంతి స్వింగ్‌ అవ్వగలదని అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో ఇషాంత్‌ శర్మ మీడియాతో మాట్లాడారు. ‘ఇక్కడ ఉమ్మి రుద్దకున్నా బంతి స్వింగ్‌ అవ్వగలదు. అయితే జట్టు సభ్యుల్లో ఎవరో ఒకరు బంతి నిర్వహణ బాధ్యత తీసుకోవాలి. ఇంగ్లండ్ వాతావరణం, పరిస్థితుల్లో బంతిని జాగ్రత్తగా పర్యవేక్షించడం అవసరం. అప్పుడే బౌలర్లు వికెట్లు తీయడం తేలికవుతుంది. ఇక లెంగ్త్‌లను సరిచూసుకోవడం కీలకం. నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా. ఫైనల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తాం’ అని ఇషాంత్‌ శర్మ అన్నాడు. కరోనా వైరస్‌ మహమ్మారి మొదలైనప్పటి నుంచి బంతిపై ఉమ్మి రుద్దడాన్ని ఐసీసీ నిషేధించడం తెలిసిందే. ‘ఇంగ్లండ్‌లో భిన్నమైన సాధన అవసరం. మార్పునకు త్వరగా అలవాటు పడాలి. భారత్‌లో కొంత సమయం తర్వాత రివర్స్‌ స్వింగ్‌ లభిస్తుంది. ఇంగ్లండ్‌లో స్వింగ్‌ ఉంటుంది కాబట్టి ఆ లెంగ్త్‌ ఫుల్లర్‌గా ఉంటుంది. అందుకే ఇక్కడి లెంగ్త్‌లకు సర్దుకుపోవాలి. ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. ఇక క్వారంటైన్‌లో ఉండటం సవాల్‌గా మారింది. ఎందుకంటే జిమ్‌లో కసరత్తులు చేయడానికి మైదానంలో సాధన చేయడానికి ఎంతో తేడా ఉంటుంది’ అని ఇషాంత్‌ తెలిపాడు.

Related posts